శ్రీకృష్ణుడి అవతారమంతా లీలామయమే. కన్నయ్య మథురలో కంసుడి చెరసాలలో పుట్టాడు. శ్రావణ మాసం కృష్ణపక్షంలో అష్టమి తిథినాడు రోహిణీ నక్షత్రంలో అర్ధరాత్రి జన్మించాడు. కృష్ణపక్షం, స్వామి పేరు కృష్ణుడు కాబట్టి కృష్ణాష్టమిగా, ఆ రోజున కన్నయ్య జన్మించాడు కాబట్టి జన్మాష్టమిగా, అదే రోజున గోకులంలోకి చేరి పెరిగినందువల్ల గోకులాష్టమిగా, యదువంశోద్భవుడు కనుక యదుకులాష్టమిగా కృష్ణాష్టమి పేరు పొందింది. ఇవాళ కన్నయ్యను ఆరాధిస్తే సకల శుభాలూ కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
రాధతోనే కృష్ణుడు ఎందుకు పూజలందుకుంటాడు?
రాధాకృష్ణులు గోలోక వాసులు. ప్రేమ స్వరూపిణి, రస దేవత రాధదే అక్కడ ఆధిపత్యం. ఓసారి కన్నయ్యపై ఆమె అలిగింది. ప్రేమ జగడాలు తెలీని సుధాముడు వందేళ్లు స్వామితో వియోగం తప్పదని ఆమెకు శాపమిచ్చాడు. దాంతో వారి అంశలు రాధాకృష్ణులుగా భూమిపై ప్రేమ, రసారాధన గురించి తెలియజేశాయి. వియోగం కోసం రాధ తపస్సుకెళ్లగా కృష్ణుడిలో నారాయణుడు ప్రవేశించాడు. ఆ తర్వాత రుక్మిణీ కళ్యాణం, సత్యభామా కలాపం, భగవద్గీత, మహాభారతం జరిగాయి.