ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: హైడ్రాకు ఎటువంటి చట్టబద్ధత లేదని విమర్శలు వస్తున్న వేళ తాజాగా హైకోర్టు సైతం ఈ సంస్థను తప్పుపట్టింది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చి వేతలు ఎలా చేపడతారంటూ హైడ్రాను హైకోర్టు ప్రశ్నించింది. జీవో 99పై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హైడ్రాకు ఉన్న అధికారాలను సవాలు చేస్తూ లక్ష్మి అనే మహిళ వేసిన పిటిషన్‌పై జస్టిస్ కే లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అమీన్‌పూర్‌లో ఈ నెల 3న షెడ్లు కూల్చివేశారని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నా కూల్చి వేశారని తెలిపారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చేసినట్లు కోర్టుకు పిటిషనర్ తెలిపారు. కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది.