తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ సంఘాలు సమావేశమయ్యాయి. బుధవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం అధికారిక నివాసంలో సమావేశమైన వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు తమ ప్రాంత సమస్యలను సీఎంకు వివరించారు. జైనూర్ ఘటన తర్వాత గిరిజనులు, మైనార్టీ వర్గాల మధ్య ఐక్యత నెలకొల్పేందుకు ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఇప్పటికే ఇరు వర్గాలతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. దీనికి కొనసాగింపుగా మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌లు చొరవ తీసుకుని సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశం ఏర్పాటు చేసి ఆదివాసీ వర్గాలను ఉద్యమించారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ గిరిజన సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. స్థానికంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ వినతిపత్రాలు సమర్పించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.