హైదరాబాద్ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా విద్యుత్ డిపోలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో డిపోల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కో ఎలక్ట్రిక్ డిపోకు 10 ఎకరాల స్థలం అవసరం. ఈ లెక్కన పది డిపోలకు వంద ఎకరాల భూమి అవసరం. అలాగే ఒక్కో డిపో ఏర్పాటుకు రూ.10 కోట్లు అవసరమని, తద్వారా మొత్తం పది డిపోలకు రూ.100 కోట్లు అవసరమని ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అలాగే, ఎలక్ట్రిక్ బస్సులను ఛార్జింగ్ చేయడానికి ప్రతి డిపోలో 33 కెవి హైటెన్షన్ విద్యుత్ సరఫరా అవసరం. కొత్తగా ఏర్పాటు చేయనున్న పది డిపోలతో పాటు ప్రస్తుతం ఉన్న 20 ఆర్టీసీ డిపోల్లో చార్జింగ్ పాయింట్లు అవసరం కానున్నాయి. దీంతో రూ.100 కోట్లకు తోడు అదనంగా మరో రూ.250 కోట్ల వరకు ఫండ్స్ అవసరం అవుతాయని ఆర్టీసీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో పేర్కొంది. గతేడాది 1000 ఎలక్ట్రిక్ బస్సుల కోసం కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న ఆర్టీసీ.. ఇప్పుడు మరో 2500 బస్సులకు ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకుంది. రానున్న రోజుల్లో డీజిల్ బస్సుల వినియోగం తగ్గనుంది.