Homeజిల్లా వార్తలులింగ నిర్ధారణ టెస్టులు చేస్తున్న ముఠా గుట్టు రట్టు.. ఐదుగురు అరెస్ట్

లింగ నిర్ధారణ టెస్టులు చేస్తున్న ముఠా గుట్టు రట్టు.. ఐదుగురు అరెస్ట్

ఇదే నిజం కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో లింగ నిర్ధారణ టెస్టులు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ శుక్రవారం తెలిపారు. ఇంట్లోనే స్కానింగ్ సెంటర్ సెట్ చేసి లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న రాజంపేట మండల కేంద్రానికి చెందిన బల్ల రవీందర్ తోపాటు ముఠాలోని నలుగురి కి సంబంధించిన వివరాలను శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వెల్లడించారు. రాజంపేటకు చెందిన రవీందర్ ఇంట్లోనే లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడనే సమాచారం మేరకు సీసీఎస్ పోలీసులు దాడి చేశారు. ఆ సమయంలో సిద్ధిపేట జిల్లా వర్గల్ కు చెందిన మహిళలకు లింగనిర్ధారణ చేస్తూ రవీందర్ పట్టుబడ్డాడు. రవీందర్ గతంలో రాజంపేటలోని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి స్కానింగ్ విభాగంలో పని చేశాడు. 2021లో తాను పని చేసిన కౌసల్య ఆస్పత్రి సీజ్ కావడంతో అక్రమమార్గంలో అలవాటు పడిన రవీందర్ తాను అల్ట్రా సౌండ్ స్కానర్ ను కొనుగోలు చేసి ఇంట్లో ఏర్పాటు చేశాడు. ఈ కేసులో రవీందర్ ఏ1 కాగా, అతడికి అల్ట్రాసౌండ్ స్కానర్ ను అమ్మిన విజయవాడకు చెందిన పొటాల సాంసన్ ఏ-2, కృష్ణ జిల్లాకు చెందిన చింతలపూడి దుర్గాప్రసాద్ ఏ-3గా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. గర్భిణులను లింగ నిర్ధారణ కోసం తీసుకువచ్చే కామారెడ్డిలోని పీఎంహెచ్ కాలనీకి చెందిన బోయిని యాదగిరిని ఏ-4గా, నర్సంపల్లికి చెందిన బక్కి ప్రవీణ్ కుమార్ ను ఏ-5గా చేర్చి కేసు నమదు చేశారు. ఐదుగురిని విచారించగా, మరో 14 మంది ఈ కేసులో నేరస్తులుగా ఉన్నట్లు తేలిందని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు. చట్ట విరుద్ధంగా లింగ నిర్ధారణ చేసే వారి వివరాలను డయల్ 100కి లేదా పోలీస్ కంట్రోల్ నంబర్ 87126861338 సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ అన్నారు. కేసు దర్యాప్తులో చురుగ్గా వ్యవహరించిన సీసీఎస్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, భిక్కనూర్ ఇన్ స్పెక్టర్ సంపత్ కుమార్, రాజంపేట ఎస్సై పుష్పరాజ్, సీసీఎస్ ఎస్సై ఉస్మాన్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Recent

- Advertisment -spot_img