తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయకులలో మకల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఒకరు. ఈ ఏడాది విడుదలై ఘన విజయం సాధించిన సినిమా ‘మహారాజా’. ఈ సినిమాకి నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించారు. విభిన్నమైన స్క్రిప్ట్ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు చచ్చనా, అనురాగ్ కశ్యప్, అభిరామి, మమతా మోహన్ దాస్, సింగం పులి, నట్టి నటరాజ్ తదితరులు నటించారు. గత జూన్లో విడుదలైన ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. విజయ్ సేతుపతి సినీ కెరీర్ లో టాప్ 10 సినిమాల లిస్ట్ తీసుకుంటే అందులో మహారాజా కూడా చేరిపోతుందనడంలో సందేహం లేదు. ‘మహారాజా’ మూవీ గత వారం చైనాలో విడుదలైంది. 40,000 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా 5 రోజుల్లో రూ. 4.15 కోట్లు వసూలు చేసింది.