కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఇటీవల కొండచరియలు విరిగిపడటంతో నష్టపోయిన వారికి కేంద్రం సహాయాన్ని అందించాలని కోరేందుకు వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వంలోని కేరళ పార్లమెంటేరియన్ల బృందం బుధవారం హోంమంత్రి అమిత్ షాతో సమావేశమ్యారు. సమావేశం అనంతరం ప్రియాంక మాట్లాడుతూ.. వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో నష్టపోయిన ప్రజలకు ఎలాంటి సహాయక వ్యవస్థ లేకుండా పోయిందని తెలిపారు. రాజకీయాలను పక్కనబెట్టి, మానవతా ప్రాతిపదికన ప్రజలకు సహాయం చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేశాము అని అన్నారు. జులై 30న సంభవించిన ఈ విపత్తు వయనాడ్‌లోని అట్టమల విభాగాలతో పాటు పుంఛిరిమట్టం, చూరల్మల మరియు ముండక్కై అనే మూడు గ్రామాలలోని పెద్ద భాగాలను ధ్వంసం చేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఈ ఘోరమైన విపత్తులో 231 మంది ప్రాణాలు కోల్పోగా, 47 మంది తప్పిపోయారు.