Homeక్రైంA bomb blast at a convention center in Kerala Kerala లోని కన్వెన్షన్​...

A bomb blast at a convention center in Kerala Kerala లోని కన్వెన్షన్​ సెంటర్​లో బాంబు పేలుడు

– ఒకరి మృతి.. 40 మందికి తీవ్ర గాయాలు
– టిఫిన్​ బాక్స్​ బాంబుగా అనుమానిస్తున్న పోలీసులు

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: కేరళలోని కలామస్సేరిలో ఆదివారం ఉదయం బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. మరో 40 మంది గాయపడ్డారు. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం జిల్లా కలామస్సేరి మున్సిపాలిటీలోని జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఉదయం పేలుడు సంభవించింది. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ వేల మంది ఉన్నారు. ప్రత్యక్ష సాక్షులు మాత్రం కన్వెన్షన్‌ హాల్లో మూడు నుంచి నాలుగు పేలుళ్లు జరిగాయని తెలిపారు. కన్వెన్షన్‌ హాల్​లో దాదాపు 2,500 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడికి చుట్టుపక్కల మండలాలైన వరపుజ, అంగమలి, ఎడపల్లి నుంచి భారీ సంఖ్యలో జనాలు వచ్చారు. ప్రార్థన సమయంలో వీరంతా కళ్లు మూసుకొని ఉండగా.. హాలు మధ్యలో భారీ పేలుడు జరిగింది. అనంతరం మరో రెండు మూడు చిన్న పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ కన్వెన్షన్‌ సెంటర్‌ లోపలి వైపు నుంచి తాళం వేసి ఉండటంతో గాయపడ్డ వారిని తరలించడంలో కొంత ఆలస్యం జరిగింది.

ఈ పేలుళ్లలో ఓ మహిళ చనిపోయింది. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జి ఉన్నతాధికారులను ఆదేశించారు. బాధితులను కలామస్సేరి మెడికల్‌ కాలేజీ, ఎర్నాకులం జనరల్‌ హాస్పిటల్‌, కొట్టాయం మెడికల్‌ కాలేజీలకు తరలించారు. టిఫిన్ బాక్స్​ బాంబుగా పోలీసులు అనుమానిస్తున్నారు.అయితే, ఐఈడీ కారణంగానే కన్వెన్షన్‌ సెంటర్లో ఈ భారీ పేలుడు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని కేరళ పోలీసులు వెల్లడించారు. ‘కలమస్సేరీలోని జమ్రా ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్లో ఉదయం 9.40కి పేలుడు సంభవించింది. ప్రత్యక్షసాక్షులు చెప్పిన వివరాల ప్రకారం రెండు పేలుళ్లు జరిగినట్లు అంచనా వేస్తున్నాం. భారీ పేలుడు పదార్థం ఐఈడీ కారణంగానే ఇది సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పేలుళ్లకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం’ అని కేరళ డీజీపీ షేక్‌ దార్వేశ్‌ సాహెబ్‌ పేర్కొన్నారు. ఇందులో ఉగ్రకోణం ఏమైనా ఉందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ..

దర్యాప్తు తర్వాతే ఏ విషయమైనా చెప్పగలమన్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఘటనా స్థలానికి ఎన్‌ఐతోపాటు ఇతర దర్యాప్తు సంస్థలు చేరుకున్నట్లు కేరళ మంత్రులు వీఎన్‌ వాసవన్‌, ఆంటోనీ రాజులు పేర్కొన్నారు. ఈ పేలుళ్లలో సుమారు 40 మంది గాయపడగా.. అందులో 10 మంది 50శాతం కంటే ఎక్కువ కాలిన గాయాలతో చికిత్స తీసుకుంటున్నట్లు కేరళ పోలీసులు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే, ద్వేషపూరిత మెసేజ్‌లు వ్యాప్తి చేయొద్దని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేలుళ్ల ఘటనతో అప్రమత్తమైన అధికారులు.. 14 జిల్లాల్లోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఘటన అనంతరం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా.. అక్కడి పరిస్థితులను ఆరా తీశారు. దర్యాప్తు కోసం కేంద్ర దర్యాప్తు బృందాలను పంపించినట్లు చెప్పారు.


బాంబు పెట్టింది నేనేనంటూ లొంగిపోయిన ఓ వ్యక్తి

కన్వెన్షన్‌ సెంటర్లో బాంబు పేలుళ్లకు తానే బాధ్యుడినని పేర్కొంటూ త్రిశూర్‌కు చెందిన ఓ వ్యక్తి పోలీసుల ముందు లొంగిపోయాడు. కలమస్సేరీలో బాంబు అమర్చింది తానేనని చెప్పినట్లు సమాచారం. దీంతో అతడిని పోలీసులు పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. ఆ బాంబు పేలుళ్లకు ఇతడికి నిజంగా సంబంధం ఉందా..? అన్న విషయంపై పోలీసులు ఇంకా ఓ నిర్ధారణకు రాలేదని తెలుస్తోంది.


దురదృష్టకర ఘటన: కేరళ సీఎం విజయన్

ఈ వరుస పేలుళ్ల ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్‌ స్పందించారు. ‘ఇదో దురదృష్టకర ఘటన. దీనిపై పూర్తి వివరాలు సేకరిస్తున్నాం. ఉన్నతాధికారులు మొత్తం ఎర్నాకులంలో ఉన్నారు. ఈ ఘటనను మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. నేను ఇప్పటికే డీజీపీతో మాట్లాడాను. దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉంది’అని పేర్కొన్నారు.


మత పెద్దలంతా ఈ ఘటనను ఖండించాలి: ఎంపీ శశిథరూర్

కాలామస్సేరిలో వరుస పేలుళ్లను మతాలకు అతీతంగా అందరూ ఖండించాలని కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ పిలుపునిచ్చారు. ‘మతపరమైన ప్రార్థనలో బాంబుదాడుల వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యా. దీనిని నేను ఖండిస్తున్నా. వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలి. మతపెద్దలు అందరు ఏకమై ఈ దాడిని ఖండించాలి’అని శశిథరూర్ అన్నారు.

Recent

- Advertisment -spot_img