ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మెట్రో విస్తరణ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటన చేసింది. భూగర్భ మెట్రో కోసం రెండో దశ విస్తరణ నిర్ణయించారు. రెండో దశలో 116.4 కిలోమీటర్ల మేర 6 కారిడార్లతో మెట్రో విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం 5 కారిడార్లకు డీపీఆర్ సిద్ధమైంది. దీంతో పాతబస్తీని అనుసంధానం చేసి మెట్రోను అందుబాటులోకి తెచ్చేందుకు పనులను ప్రారభించనున్నారు. రెండో దశ విస్తరణలో భాగంగా నాగోల్-శంషాబాద్ విమానాశ్రయం, రాయదుర్గం-కోకాపేట్, ఎంజీబీఎస్-చంద్రాయణగుట్ట, మియాపూర్-పటాన్చెరు, ఎల్బీనగర్-హయత్నగర్ ఈ ఐదు కారిడార్లుగా అధికారులు వెల్లడించారు. విమానాశ్రయం దగ్గర 1.06 కి.మీ. భూగర్భ మార్గాన్ని నిర్మించనున్నారు. తొలుత నాగోలు నుంచి విమానాశ్రయం వరకు 24 స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం మాత్రం 20 నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. మెట్రో రెండో దశ కోసం పాతబస్తీలో 1100 ఆస్తులు సేకరించాల్సి ఉందని గుర్తించారు. దీని కోసం ఒక్కో కిలోమీటరుకు రూ.318 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. జనవరి మొదటి వారం నుంచి ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ గుట్ట వరకు మెట్రో రెండో దశ పనులు ప్రారంభమవుతుందని అధికారులు ప్రకటించారు. పటాన్చెరు నుంచి హయత్నగర్ వరకు పూర్తిస్థాయి కారిడార్ ఉంటుందని అధికారులు తెలిపారు.