– వివరాలు వెల్లడించిన రామగుండం సీపీ రెమా రాజేశ్వరి
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: మావోయిస్ట్ పార్టీ కోల్ బెల్ట్ ఏరియాలో తన ప్రభావాన్ని పునరుద్ధరించు కోవడానికి చేసే ప్రయత్నాలలో భాగంగా గోదావరిఖనికి వచ్చిన మావోయిస్ట్ పార్టీ సభ్యుడిని అరెస్ట్ చేశామని రామగుండం పోలీస్ మిషనర్ రెమా రాజేశ్వరి తెలిపారు. ఈ మేరకు వివరాలను మీడియాకు వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి గోదావరిఖని పట్టణంలోని ఆర్ జీ -1 ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం జంక్షన్ వద్ద పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ ఉండగా ఒక వ్యక్తి చేతిలో సంచితో సీఎస్పీ కాలనీ వైపు వెళ్తూ పోలిసులకు కనిపించాడు. అతడు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలిసులు దగ్గరికి వెళ్లారు. పోలీసులను చూసి ఆ వ్యక్తి పారిపోయే ప్రయత్నం చేశాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు అతడిని పట్టుకొని విచారించగా మావోయిస్ట్ పార్టీ సభ్యుడిగా..తమ కార్య కలాపాలను విస్తరించడానికి పార్టీ ఆదేశాలతో గోదావరీఖనికి వచ్చినట్టు అంగీకరించాడని సీపీ తెలిపారు. పట్టుబడ్డ మావోయిస్ట్ పార్టీ సభ్యుడి పేరు అవినాశ్ అని అతడి నుంచి కొన్ని వాల్ పోస్టర్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆమె చెప్పారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.