కర్ణాటక మహారాజా టీ20 ట్రోఫీలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ మ్యాచ్ జరిగింది. మహారాజా టీ20టోర్నీలో భాగంగా హుబ్లీ టైగర్స్, బెంగళూరు బ్లాస్టర్స్ మధ్య జరిగిన మ్యాచ్ మూడు సూపర్ ఓవర్లకు దారి తీసింది. చివరకు ఈ మ్యాచ్‌లో హుబ్లీ టైగర్స్ విజయం సాధించింది. భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు రెండు సూపర్ ఓవర్లే జరిగాయి. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. హుబ్లీ టైగర్స్, బెంగళూరు బ్లాస్టర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇరు జట్లు 164 పరుగులు చేశాయి. తొలి సూపర్‌ఓవర్‌లో బెంగళూరు 10/1, హుబ్లీ 10/0.. రెండో సూపర్‌ఓవర్‌లో బెంగళూరు 8/0, హుబ్లీ 8/1 స్కోర్లు చేశాయి. మూడో సూపర్‌ఓవర్‌లో బెంగళూరు 12/1 స్కోరు చేయగా, హుబ్లీ 13/1 స్కోరు చేసి విక్టరీని సాధించింది.