- పార్టీ మారనున్న విజయుడు, చల్లా వెంకట్రామిరెడ్డి
- ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌తో సంప్రదింపులు
- నేడో, రేపో పార్టీ మారే చాన్స్
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్‌లోని ఏడుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీని వీడి కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. వరుస ఫిరాయింపులతో పార్టీ అధినేత, ముఖ్యనేతల్లో టెన్షన్ నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్‌లోని మరో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పార్టీ మారుతున్నట్లు సమాచారం. దీంతో బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కేవలం రెండు నియోజకవర్గాల్లోనే గెలుపొందింది. అందులో ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హస్తంగూటికి చేరిపోయారు. తాజాగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరగుతోంది. అదే జరిగితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది. కాగా, ఎమ్మెల్యే విజయుడుతో పాటు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కూడా రేపో మాపో కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయినట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.
ఎంపీపీలు, జడ్పీటీసీలు కూడా.. !
గద్వాల బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ మిగిలేలా కనిపించడం లేదు. ఎమ్మెల్యే వెంట అందరూ నేతలు కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, పీఎసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కూడా కాంగ్రెస్ లో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం.