- మరో ఉద్యోగి కూడా..
ACB: ఇదే నిజం, ఫీర్జాదిగూడ: ఓ మహిళా ఉద్యోగి రూ. 20 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో చోటు చేసుకున్నది. ఫిర్జాదిగూడ కార్పొరేషన్ కార్యాలయంలో కే జానకి శానిటరీ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. కాగా ఎన్ శ్రీరాములు అనే మున్సిపల్ కాంట్రాక్టర్ కు చెందిన పలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి.
దీంతో తన బిల్లులను క్లియర్ చేయాలంటూ చాలా రోజులుగా శానిటరీ ఇన్ స్పెక్టర్ చుట్టూ తిరుగుతున్నారు. కాగా ఆమె లంచం డిమాండ్ చేసింది. రూ. 20 వేలు చెల్లిస్తే బిల్లులు మంజూరు చేస్తానంటూ చెప్పింది. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. పక్కా ప్లాన్ ప్రకారం ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఇవాళ లంచం ఇచ్చేందుకు ఆ డబ్బుతో శ్రీరాములు కార్యాలయానికి చేరుకున్నాడు. కాగా శానిటరీ ఇన్ స్పెక్టర్ జానకి.. ఆ డబ్బును అటెండర్ సరోజకు ఇవ్వాలని చెప్పింది. దీంతో అతడు సరోజకు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.