తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్న సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పలు వివరాలు వెల్లడించారు. ప్రతి 150 ఇళ్లకు ఒక ఎన్యూమరేటర్ ఉంటారని తెలిపారు. 56 ప్రశ్నలకు సంబంధించి అన్ని వివరాలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలందరికీ సమాచారం అందించాలని పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ప్రజా సంక్షేమం, అసమానతల నిర్మూలన కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. తెలంగాణలో జీహెచ్‌ఎంసీ పరిధి చాలా పెద్దదని అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 1,17,44,000 ఇళ్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తామని చెప్పారు.
ఎన్యూమరేటర్లు ప్రజల సందేహాలను తీర్చే విధంగా సర్వే నిర్వహించాలని పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ సామాజిక స్థితిగతులు ఈ సర్వే ద్వారా తెలుస్తాయని చెప్పారు. తాము చేస్తున్న మంచి పనులను కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఎన్నో పనులు చేస్తోందని పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు ఇళ్లపై స్టిక్కర్లు వేయనున్నారు. 9వ తేదీ నుంచి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించనున్నారు.