సీనియర్లలో పొడచూపుతున్న విభేదాలు
రాహుల్ పరిణతిపై మరోసారి చర్చ
చర్చకు దారితీస్తున్న కాంగ్రెస్ నేతల వ్యవహారం
న్యూ ఢిల్లీః కాంగ్రెస్ సీనియర్ నేతల వ్యవహారం మరోసారి దేశ వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. సోమవారం సోనియా గాంధీ ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం జరిగిన అనంతరం జరిగిన సంఘటనలు మరోసారి కాంగ్రెస్ నాయకత్వ లేమీని తెలియజేసింది. ఒక పక్క కాంగ్రెస్‌కు 30 ఏండ్లకు పైగా సేవలు చేసిన తనపట్ల రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చులకన భావం చూపాయని కొందరు నేతలు ట్విటర్ వేదికలపై బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం, మరోపక్క పార్టీలోని కీలక ట్రబుల్ షూటర్‌గా పేరున్న గులాంనబీ ఆజాద్ రాజీనామాకు సిద్ధమయ్యారంటూ వార్తలు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశమయ్యాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రిజైన్ చేశారు. అప్పటి నుంచి ఆయన ట్విటర్ వేదికలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన వాణిని విన్పిస్తున్నారు. చాలా కాలంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని భర్తీ చేయనందున అనేక సమస్యలు తలెత్తున్నట్లు, బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, ఇటీవల రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో తలెత్తిన రాజకీయ సంక్షోభాలను పరిష్కరించడంలో సమస్యలు ఎదురైనట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్, కపిల్‌సిబాల్, ఆనందశర్మ తదితర సీనియర్ నేతలు రెండు లేటర్ల ద్వారా సోనియా గాంధీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ లెటర్లపై ఒక పక్క రాహుల్ గాంధీ మరోపక్క కాంగ్రెస్ సీనియర్ నేతలు మన్మోహన్‌సింగ్, అహ్మద్‌పటేల్, చిదంబరం లాంటి నేతలు తప్పుపడుతున్నారు. దాంతో కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతల మధ్య విభేదాలు పొడచూపుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు భర్తీ చేసేవరకు సోనియా గాంధీకే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలని అందరూ సీనియర్ నేతలు ముక్తకంఠంతో కోరడం కాస్తా ఊరట కలిగించే అంశం.