ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ దాదాపు 80 విమాన సర్వీసులను రద్దు చేసింది. దాదాపు 300 మంది క్యాబిన్ క్రూ సిబ్బంది అనారోగ్య కారణాలతో సెలవు తీసుకోవడం వల్ల విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏఐఎక్స్ కనెక్ట్, ఎయిర్ ఇండియాలో విలీనమైనప్పటి నుంచి సిబ్బంది అసంతృప్తితో ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు తెలిపాయి. మరోవైపు విమానాలు రద్దవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. దీనిపై ఎయిర్ ఇండియా స్పందిస్తూ..ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. ప్రయాణాన్ని వారం రోజుల్లోగా రీషెడ్యూల్ చేసుకోవాలని సూచించింది. అవసరమైతే రీఫండ్ ఇస్తామని పేర్కొంది.