ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : అక్బరుద్దీన్ ఒవైసీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ ఇచ్చి, కొడంగల్ నియోజకవర్గం నుంచి బరిలో నిలుపుతామని, దగ్గరుండి నామినేషన్ వేయిస్తామని, గెలిచిక డిప్యూటీ సీఎం పదవి అప్పగిస్తామని వెల్లడించారు. శనివారం సీఎం రేవంత్ అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ సీఎం రేవంత్ ఆఫర్‌ను తిరస్కరించారు. తాను మజ్లిస్ పార్టీలోనే ఉంటానని, పార్టీలో సంతోషంగానే ఉన్నానన్నారు. తాను పార్టీ మారే ప్రసక్తి లేదన్నారు. చివరి శ్వాస వరకు మజ్లిస్ పార్టీలోనే కొనసాగుతానని పేర్కొన్నారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం మంచిదేనని, కానీ ఆటో కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన మాట నెరవేర్చాలన్నారు. హైదరాబాద్ పట్టణానికి మెట్రో రావడానికి తాను కృషి చేశానన్నారు. వైయస్ వల్లే హైదరాబాద్‌కు మెట్రో రైలు వచ్చిందన్నారు. పాతబస్తీకి మాత్రం ఇప్పటి వరకు మెట్రో రాలేదన్నారు.
పాతబస్తీ మెట్రో నిర్మాణానికి చర్యలు…
పాతబస్తీ మెట్రో నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు. దీన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, మెట్రో నిర్మాణం కోసం ఎల్ అండ్ టీతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నామన్నారు. హైటెక్ సిటీ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు గత ప్రభుత్వం టెండర్లు పిలిచిందని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ సంస్థల భూముల ధరలను పెంచేందుకే ఆ మార్గంలో మెట్రో రైలు ప్రతిపాదించారన్నారు. ఇప్పటికే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు మంచి రోడ్లు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం మెట్రో అవసరం లేని మార్గాల్లో మెట్రో నిర్మాణానికి టెండర్లు పిలిచారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఎల్బీ నగర్ నుంచి ఎయిర్ పోర్టుకు మెట్రో నిర్మిస్తుందన్నారు. పాతబస్తీకి మేలు కలిగేలా చాంద్రాయణగుట్ట మీదుగా మెట్రో నిర్మాణం చేపడతామన్నారు.
ఓల్డ్ సిటీ కాదు… ఒరిజినల్ సిటీ
రెండో దశ మెట్రోకు నిధులు కోరితే కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదని సీఎం రేవంత్ అన్నారు. పాతబస్తీకి, ఎయిర్ పోర్టుకు మెట్రోను కచ్చితంగా నిర్మిస్తామన్నారు. రెండో దశ మెట్రో నిర్మాణానికి భూసేకరణను ఇప్పటికే ప్రారంభించామన్నారు. పాతబస్తీని గత ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ అని రేవంత్ అన్నారు. రెండో విడత మెట్రో విస్తరణపై గత ప్రభుత్వం కాకిలెక్కలు చెప్పిందని ఆరోపించారు. హైదరాబాద్‌కు మెట్రో రైలు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. తాము వచ్చాక పాతబస్తీ మెట్రో ప్రాజెక్టు విషయమై రీడిజైన్ చేశామన్నారు. తాను ముఖ్యమంత్రి కాగానే పాతబస్తీ మెట్రోపై దృష్టి సారించానన్నారు. గత ప్రభుత్వంలా హైదరాబాద్‌ను ఇస్తాంబుల్ చేస్తాం, లండన్ చేస్తామని తాము చెప్పమని, కానీ అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.