నిరుద్యోగలకు ఉపాధి కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా, ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఈబీసీ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రూ. లక్ష నుండి రూ.4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడనికి రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఏప్రిల్ 1 వరకు అనుమతించింది. అయితే తాజాగా ఆ గడువును ఏప్రిల్ 14 వరకు పొడిగించారు. ఈ పథకం కింద ఏప్రిల్ 3 వరకు 7 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. మరోవైపు, సర్వర్ బిజీగా మారడంతో సర్టిఫికెట్ల జారీ చాలా నెమ్మదిగా కొనసాగుతోంది. ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు స్పందించిన ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులను ఉపయోగించి దరఖాస్తులను చేసుకోవడానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది.