– ఫైటర్ జెట్‌కు రాడార్, ఎలక్ట్రానిక్
వార్ఫేర్ సూట్‌ను అమర్చనున్న రక్షణ శాఖ
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: భారత్ దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి ఫైటర్‌జెట్ విమానం ఎల్‌సీఏ తేజస్ మార్క్–1లో సరికొత్త స్వదేశీ పరికరాలు అమర్చనున్నారు. భారత్‌లో అభివృద్ధి చేసిన రాడార్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ అమర్చే కార్యక్రమం అతి త్వరలోనే మొదలుకానుందని రక్షణశాఖ వర్గాలు ఓ ఆంగ్ల మీడియాకు వెల్లడించాయి. భారత వాయుసేనలో ఇప్పటికే ఎల్‌సీఏ తేజస్ మార్క్–1 ఫైటర్ జెట్ విమానాలు సేవలు అందిస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని తేజస్‌లు వచ్చి చేరనున్నాయి. ఈ నేపథ్యంలో రక్షణశాఖ వర్గాలు స్పందిస్తూ.. ‘దేశీయంగా తయారైన ‘ఉత్తమ్’ ఏఈఎస్‌ఏ రాడార్, అంగద్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్‌ను అమర్చే పనిలో వేగవంతమైన పురోగతి సాధించింది. అతి త్వరలోనే ఇవి విమానంలో అనుసంధానానికి సిద్ధమవుతాయి’అని ఓ ఆంగ్ల మీడియాకు వెల్లడించాయి.
మొత్తం ఇప్పటి వరకు ఆర్డర్ చేసిన 83 విమానాల్లో.. 41వ విమానం నుంచి ఈ దేశీయ పరికరాలు అమర్చడం మొదలవుతుంది. దీనిలో డీఆర్‌డీవోకు చెందిన వివిధ పరిశోధనాశాలలు భాగం కానున్నాయి. ప్రస్తుతం ఉత్తమ్ పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని రక్షణశాఖ చెబుతోంది. ఎల్‌సీఏ విమానాల్లో వీటి అమరిక మొదలైతే.. భారత్‌కు కొన్ని వందల కోట్ల రూపాయలు మిగులుతాయి. దీంతోపాటు భారీ ఎత్తున దేశీయంగా ఉపాధి లభిస్తుంది. ఇప్పటికే ఈ ప్రణాళికలను రక్షణశాఖ, ఇతర విభాగాలకు సమర్పించినట్లు తెలుస్తోంది. గత వారం వాయుసేన చీఫ్ వీఆర్ చౌధ్రీ వీటి పురోగతిపై సమీక్ష నిర్వహించారు. తేజస్ విమానాలు భారత వాయుసేనలోని మిగ్ సిరీస్‌ఫైటర్ జెట్‌ల స్థానాన్ని భర్తీ చేయనున్నాయి.