సినీ నటుడు రఘుబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీనియర్ నటుడు గిరిబాబు తనయుడు. తండ్రి పేరు వాడకుండా తెలుగులో చాలా సినిమాలు చేసి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గిరిబాబు గురించి రఘుబాబు పలు విషయాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ మా సొంత బ్యానర్ పై నాన్న సినిమాలు కొన్ని నిర్మించారు. 1990లో తమ్ముడు హీరోగా ‘ఇంద్రజిత్’ సినిమాను నిర్మించాం. అప్పట్లోనే ఆ సినిమా కోసం 50 లక్షలు ఖర్చు చేసాం. సినిమా బాగానే ఆడింది. కానీ డబ్బులు మా వరకూ రాలేదు. ఆ సినిమా రిలీజ్ చేయడానికి నాన్న చాలా ఇబ్బందులు పడ్డారు. రిలీజ్ తర్వాత బాగుందని టాక్ వచ్చినా మా చేతికి రూపాయి రాలేదు. రాకపోగా భారీగా నష్టాలు చూపించారు. నిజానికి సినిమా బయట పడిపోయిన తరువాత ఎవరూ ఎవరినీ పట్టించుకోరు. కానీ నాన్న గారు అలా కాదు. మాకు రూపాయి రావలసి ఉంది అంటూ ఎవరూ గేటు ముందుకు రాకూడదనేది ఆయన పద్ధతి. ‘ఇంద్రజిత్’ సినిమా కారణంగా వచ్చిన నష్టాలను పూడ్చడం కోసం, నాన్నగారు స్థిరాస్తులను అమ్మేశారు. ఆయన 20 – 25 సంవత్సరాలుగా సంపాదించిందంతా పోయింది. కాలం కలిసొస్తే మళ్లీ సంపాదించు కుందాం. లేదంటే ఊరు వెళ్లిపోదామని నాన్న చెప్పారు. అలా ఎన్నో ఇబ్బందులను తట్టుకుని నిలబడ్డాం’ అని అన్నారు.