వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య వివాదం కొత్తేమీ కాదు. ఈ ఏడాది జనవరి 3న ఇరాక్‌లో డ్రోన్ దాడితో రివల్యూషనరీ గార్డ్స్ కుడ్స్ ఫోర్స్ నేత సోలైమానిని అమెరికా హతమార్చిన దగ్గర నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. ఇరాన్ టాప్ మిలటరీ జనరల్ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా.. దక్షిణాఫ్రికాలోని అమెరికా రాయబారి లానా మార్క్స్‌పై ఇరాన్ ప్రభుత్వం హత్యాయత్నాలు చేస్తోందని వార్తల నేపథ్యంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌కు తీవ్రంగా హెచ్చరించాడు. అమెరికాపై ఏ రూపంలో దాడి జరిగినా వెయ్యి రెట్లు ప్రతిదాడి తప్పదని ట్రంప్ ఇరాన్‌ను పరోక్షంగా హెచ్చరిస్తూ ట్విట్ చేశారు. గతంలో అమెరికన్ రాయబారుల హత్యలను ప్రణాళిక వేసిన ఆరోపణలు ఇరాన్‌పై ఉండటంతో ట్రంప్ తాజా హెచ్చరికలు ప్రపంచ వ్యాప్తంగా చర్చగా మారుతున్నాయి. మరోవైపు ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. అమెరికాలో నవంబర్ 3న జరగనున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ట్రంప్ ఇలా ఇరాన్ వ్యతిరేక ప్రచారంలో భాగంగానే తాజా ఆరోపణలని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయీద్ ఖతీబ్జాదే ఒక ప్రకటనలో తెలిపారు.