– సమర్థంగా తిప్పికొట్టాలి
– కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఇదేనిజం, హైదరాబాద్: ఆర్థిక వ్యవస్థను బలహీనం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలన్నారు. దేశంలో వివిధ రకాల వ్యవస్థీకృత నేరాలు సవాళ్లు విసురుతున్నాయని చెప్పారు. కర్తవ్య నిర్వహణలో అమరవీరుల బలిదానం ప్రేరణ కావాలని చెప్పారు. హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో 75వ బ్యాచ్ ఐపీఎస్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. 175 మంది ట్రైనీ ఐపీఎస్లు శిక్షణ పూర్తిచేసుకోవడంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. దీనికి అమిత్షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ట్రైనీ ఐపీఎస్ల నుంచి ఆయన గౌరవవందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడారు. ‘మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభించాయి. కర్తవ్య నిర్వహణలో అమరవీరుల బలిదానం ప్రేరణ కావాలి. వివిధ రకాల వ్యవస్థీకృత నేరాలు సవాళ్లు విసురుతున్నాయి.
క్రిప్టో కరెన్సీతో దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనానికి యత్నిస్తున్నారు. హవాలా, నకిలీ నోట్ల కట్టడికి మరింత పటిష్ఠంగా పోరాడాలి. ఆంగ్లేయుల కాలం నాటి 3 చట్టాలను మార్చాల్సి ఉంది. సీఆర్పీసీ, ఐపీసీ, ఎవిడెన్స్ చట్టాల్లో మార్పులు చేయాల్సి ఉంది. ఈ మూడు చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసి పార్లమెంట్ ముందుంచింది. త్వరలోనే నేర చట్టాల బిల్లు ఆమోదం పొందుతుంది. శాసననాలను సురక్షితంగా ఉంచడమే పాత చట్టాల ఉద్దేశంగా ఉండేది. ప్రజల హక్కులను సురక్షితంగా ఉంచడం కొత్త చట్టాల ఉద్దేశం. కొత్త చట్టాల ఆధారంగా అధికారులు ప్రజలకు రక్షణ కల్పించాలి’ అని అమిత్షా పిలుపునిచ్చారు.