ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నేత పక్కపక్కనే కూర్చొని నవ్వుతూ పలకరించుకున్న అరుదైన దృశ్యం శుక్రవారం పార్లమెంట్లో చోటు చేసుకుంది. పార్లమెంట్ కాంప్లెక్స్‌లో జరిగిన ఓ సమావేశంలో ఈ సన్నివేశం జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. దీంతో ఉభయసభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. వాస్తవానికి ఆగస్టు 12న ముగియాల్సి ఉండగా నేడు సభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. అయితే సమావేశాల ముగింపునకు ముందు పార్లమెంట్ అవరణలో అనధికారిక టీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ప్రధాని మోడీతో పాటు, కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలందరూ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ప్రధాని మోడీ ఓ సోఫాలో కూర్చోగా.. ఆయన పక్కనే స్పీకర్ ఓం బిర్లా కూర్చున్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీకి కుడివైపున అతి సమీపంలో కూర్చున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్‌చ కిరణ్ రిజిజు, కింజరాపు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాశ్వాన్, పీయూష్ గోయల్‌తో పాటు ప్రతిపక్ష ఎంపీలు సుదీప్ బందోపాధ్యాయ, కనిమొళి కూడా ఈ సమావేశంలో ఉన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డ నేతలంతా ఇలా నవ్వుకుంటూ మాట్లాడుకోవడం ఆసక్తికరంగా మారింది.