ఢిల్లీ : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సహనిందితులు బెయిల్ పై ఉన్నప్పుడు చంద్రబాబు కూడా బయటే ఉంటే నష్టమేంటని ధర్మాసనం ప్రశ్నించింది. చంద్రబాబుకు సంబంధించి సుప్రీం కోర్టులో ఉన్న ఇతర కేసుల వివరాలను కోరగా ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ లూడ్రా దర్మాసనానికి అందజేశారు. “3022 లో ఈ కేసుపై ఎస్ఎల్పీ దాఖలైంది. అందువల్ల 17వ నిబంధన వర్తిస్తుందా?” అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. విభిన్న అభిప్రాయాలతో ఇచ్చిన తీర్పునకు. ఈ కేసుకూ సంబంధం ఉందా? అని ఆరా తీసింది. తెదేపా అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. కేసులో సహ నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకూ వర్తిస్తాయని స్పష్టం చేసింది. పలు ఐపీసీ సెక్షన్లు కూడా ఈ కేసుపై ఉన్నాయని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది వివరించారు. సెక్షన్ 420 కింద కూడా దర్యాప్తు జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ఆ సెక్షన్ ఎలా వర్తిస్తుందని ధర్మాసనం అడిగింది. అన్ని వివరాలు పరిశీలించిన న్యాయస్థానం.. మిగతా కేసుల్లో సాధారణ బెయిల్ కూడా మంజూరైంది కదా అని వ్యాఖ్యానించింది. కొన్ని కేసుల్లో సాధారణ బెయిల్, మరికొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ వచ్చిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.