Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు అన్నదాత సుఖీభవ పథకంను అమలు చేయడానికి సిద్ధమైంది. ఈ పథకం ద్వారా రైతులకు పంటల సాగుకు అవసరమైన ఆర్థిక భరోసా కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అర్హులైన రైతుల జాబితా ఇప్పటికే సిద్ధం చేసారు. ఆ జాబితాని అధికారిక వెబ్‌సైట్‌తో పాటు గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు. అయితే ఈ పథకం నిధులు జూన్ చివరిలోనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, ఇంకా నిధులు విడుదల కానందున రైతులు ఎదురుచూస్తున్నారు.
కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్ పథకంతో కలిపి అన్నదాత సుఖీభవ పథకం నిధులను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ప్రతి ఏటా రూ.6,000 మూడు విడతల్లో (విడతకు రూ.2,000) వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఇందుకు అదనంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏటా రూ.14,000 అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో పీఎం కిసాన్ నుంచి రూ.2,000, అన్నదాత సుఖీభవ నుంచి రూ.5,000 కలిపి మొత్తం రూ.7,000 రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ప్రభుత్వం ఈ నెల 9వ తేదీ లేదా ఆ తర్వాత పీఎం కిసాన్ నిధులతో పాటు అన్నదాత సుఖీభవ పథకం నిధులను విడుదల చేయనుంది.
అర్హత ఉన్నప్పటికీ కొందరు రైతుల పేర్లు అన్నదాత సుఖీభవ పథకం జాబితాలో చేరలేదు. అటువంటి రైతుల కోసం ప్రభుత్వం మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అర్హతకు అవసరమైన అన్ని పత్రాలు, నిబంధనలు పాటిస్తే వారి ఖాతాల్లో కూడా నిధులు జమ చేయబడతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతులు తమ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌లో జాబితాను చెక్ చేసుకోవచ్చు లేదా సమీపంలోని సచివాలయంలోని రైతు సేవా కేంద్రం (RBK) అధికారిని సంప్రదించి జాబితా వివరాలు తెలుసుకోవచ్చు. ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే 155251 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.