– 33 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్..
– 83 మందితో బీజేపీ సెకండ్ లిస్ట్
ఇదేనిజం, నేషనల్ బ్యూరో: రాజస్థాన్‌లో కాంగ్రెస్, బీజేపీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ 33 మందితో ఫస్ట్ లిస్ట్ ప్రకటించగా .. 83 మందితో బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఝల్రాపటన్ నుంచే బరిలోకి దిగనున్నది. ఈ నియోజకవర్గం నుంచి ఆమె ఇప్పటికే 4 సార్లు విజయం సాధించారు. మేవాఢ్ వీరుడు మహారాణా ప్రతాప్ సింగ్ వారసుడు విశ్వరాజ్ సింగ్ మేవాఢ్‌ను నాథ్‌ద్వారా నుంచి నిలబెట్టింది. అటు ప్రముఖ రాజకీయ నేత భైరాన్ సింగ్ షెఖావత్ అల్లుడు నర్పత్ సింగ్ రజ్వీకు కూడా తాజా జాబితాలో చోటు దక్కింది. 83 మందితో బీజేపీ నేడు రెండో విడత జాబితాను విడుదల చేయగా.. ఇప్పటివరకు 124 మంది అభ్యర్థులను ఖరారు చేసింది.
కాంగ్రెస్ కూడా శనివారం 33 మందితో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అయితే, ఇందులో పెద్దగా ఎలాంటి మార్పులు చేయలేదు. ఎప్పటిలాగే.. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సర్దార్‌పురా నుంచి, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ టోంక్ నుంచి బరిలోకి దిగుతున్నారు. స్పీకర్ సీపీ జోషి.. నాథ్‌ద్వారా నుంచి పోటీ చేస్తున్నారు. రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. కాంగ్రెస్ ఇంకా మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ ఆదివారం పార్టీ సీడబ్ల్యూసీ సమావేశం తర్వాత మరిన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.