జబర్దస్త్ కామెడీ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఆనందాన్ని పంచుతోంది. అందులో పనిచేసే ఆర్టిస్ట్‌లు చాలామంది తమ కెరీర్లో ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నారు. హీరోలు, దర్శకులు, రైటర్స్‌గా కూడా రాణిస్తున్నారు. అలాంటి వారిలో సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను కూడా ఉన్నారు. అసలీ ముగ్గురు కలిసి జబర్దస్త్‌లో స్కిట్స్ చేస్తున్నారంటే ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వాల్సిందే. గతంలో ఈ ముగ్గురు కలిసి 3 మంకీస్ అనే సినిమా కూడా చేశారు.
అయితే సుడిగాలి సుధీర్ వరుసగా సినిమాలు చేస్తూ హీరోగా ఎదిగేందుకు కష్టపడుతున్నారు. ఇప్పటికే హీరోగా గాలోడు, సాఫ్ట్వేర్ సుధీర్ లాంటి సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు మరిన్ని సినిమాలు చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇక గెటప్ శ్రీను ఇతర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తూ ముందుకెళ్తున్నారు. అలాగే హీరోగా కూడా మారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కథానాయకుడిగా ఆయన నటించిన రాజు యాదవ్ విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటిస్తున్న గెటప్ శ్రీను తాను నటించబోయే మరో కొత్త సినిమా గురించి కూడా హింట్ ఇచ్చినట్లు తెలిసింది. ఆటో రాం ప్రసాద్‌తో కలిసి ఈ సినిమా చేయబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. “ఆటో రాంప్రసాద్ రైటింగ్ మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి కామెడీనే ప్రధానంగా స్క్రిప్ట్ రాస్తూ వస్తున్నాడు. అతనికి సినిమాని హ్యాండిల్ చేయగల సత్తా ఉందని నేను నమ్ముతున్నాను. నన్ను సుధీర్‌ను ప్రధాన పాత్రలలో పెట్టుకునేలా అతడు ఒక కథ రాసుకుంటున్నాడు. అన్నీ కుదిరితే ఈ సినిమాను పట్టాలెక్కిస్తాం” అని గెటప్ శ్రీను చెప్పినట్లు వార్తలు కనిపిస్తున్నాయి.
ఇంకా తనకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చాలా మంచి అవకాశాలు వస్తున్నాయని, హీరోగా మళ్లీ ఛాన్స్ వస్తే చేయగలనో లేదో చెప్పలేనని అన్నారు గెటప్ శ్రీను. రాజు యాదవ్ సినిమాలోనూ తాను హీరో కాదని కథే హీరో అని చెప్పారు. తనది కేవలం ఒక ప్రధాన పాత్ర మాత్రమే అని చెప్పుకొచ్చారు. కాగా, ఇప్పటికే జబర్దస్ నుంచి వేణు, ధనరాజ్ వంటి వారు దర్శకులు మారిన సంగతి తెలిసిందే.