తెలంగాణలో మరో కొత్త రైల్వే స్టేషన్ త్వరలో అందుబాటులోకి రానుంది. రైల్వే కనెక్టివిటీని పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో కొత్త లైన్ల ఏర్పాటుతో పాటు పలు స్టేషన్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు. చర్లపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లతో పాటుగా మరికొన్ని స్టేషన్లకు కొత్తరూపునిస్తున్నారు. కాగా, రాష్ట్రంలో త్వరలోనే మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కీలక అప్డేట్ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి వద్ద నూతన రైల్వే హాల్ట్ నిర్మిస్తుండగా.. రికార్డు సమయంలోనే హాల్ట్ నిర్మాణం పూర్తవుతోందని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో శంకుస్థాపన చేయగా.. ప్రస్తుతం నిర్మాణం వేగంగా సాగుతోందని అన్నారు. ప్రస్తుతం 70 శాతం పనులు పూర్తయ్యాయని.. ఈ స్టేషన్ నిర్మాణం పూర్తయితే కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించే యాత్రికులకు, ముఖ్యంగా హైదరాబాద్ నుండి వచ్చే యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందన్నారు. మరియు స్థానికులకు కూడా మెరుగైన ట్రైన్ సౌకర్యాలు అందుతాయని అన్నారు.