ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా భౌతికకాయాన్ని ముంబైలోని నారిమన్ పాయింట్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కి తరలించారు. ఎన్సీపీఏ వద్ద రతన్ టాటా భౌతికకాయానికి ప్రముఖులు, అభిమానులు మరియు ప్రజలు నివాళులర్పించారు.ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కూడా రతన్ టాటా భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
రతన్ టాటా ఒక అద్భుతమైన వ్యక్తి అని అభివర్ణించారు. ఆయనతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని వెల్లడించారు. ఆయన ఎల్లప్పుడూ దేశం గురించే మాట్లాడేవారని చంద్రబాబు తెలిపారు. డబ్బు సంపాదనే అంతిమ లక్ష్యం కాదని, నైతిక బాధ్యతగా ఆ డబ్బును ప్రజల కోసం ఖర్చు చేయడం మంచి హృదయాన్ని చూపుతుందని రతన్ టాటా వివరించారు.వ్యాపార రంగంలో రతన్ టాటా వంటి వారు అరుదుగా కనిపిస్తుంటారని పేర్కొన్నారు. అటువంటి దిగ్గజం రతన్ టాటా మరణం తీరని లోటు అని పేర్కొన్నారు. కాగా, రతన్ టాటా అంత్యక్రియలు మరికాసేపట్లో జరగనున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.