– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు
ఇదే నిజం, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరవు పరిస్థితి ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. కరవు, కృష్ణా జలాల పునఃపంపిణీ విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా సోమవారం విజయవాడలో సీపీఐ నేతలు 30 గంటల దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు. ‘కరవుపై సీఎం జగన్ అబద్ధాలు చెబుతున్నారు. రాష్ట్రంలో కరవు మండలాలు 400 ఉంటే ఆ తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించి చెబుతోంది. అందుకే ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. రాష్ట్రంలో చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. రైతులు, కూలీలు, చేతివృత్తుల వారు వలసలు పోతున్నారు. జీవనం దుర్భరంగా మారడంతో కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఉత్పన్నమవుతోంది. ఇంత జరుగుతున్నా సీఎం జగన్‌లో చలనం లేదు. రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టలేదు. కరవుపై సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలెవరూ మాట్లాడటం లేదు. కనీసం కేబినెట్‌లో అయినా దీనిపై చర్చించని దుర్మార్గ ప్రభుత్వం ఇది. బటన్ నొక్కే మంత్రిగా సీఎం మారారు. ఆ నిధులు కూడా లబ్ధిదారుల ఖాతాల్లో పూర్తిస్థాయిలో పడటం లేదు. జగన్ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. రైతుల గోడు పట్టించుకోని వ్యక్తి సీఎంగా ఉండటం మన దౌర్భాగ్యం. ఆయన సాయం చేయకపోగా కేంద్రానికి నివేదిక కూడా పంపడం లేదు. ఏపీ సీఎం అంటే కేంద్రానికి లేక్కే లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులను ఆదుకోవాలి’అని రామకృష్ణ డిమాండ్ చేశారు