2014లో రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఏపీ ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్న తరుణంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. మొదటి నాలుగేళ్లు పాలన బాగానే ఉన్నా చివరికి వచ్చేసరికి ప్రత్యేక హోదా అంశం విషయంలో తీవ్ర వ్యతిరేకత. నాలుగేళ్లయినా చెప్పుకోదగ్గ అభివృద్ధి లేదనే అసంతృప్తి ప్రజల్లోకి చొప్పించి సక్సెస్ అయ్యారు వైఎస్ జగన్. ఎన్నికలకు ముందు చంద్రబాబును రాష్ట్రంలోనే ఉండకుండా చేసేలా ప్రజలను ఉసిగొల్పాడు. పాదయాత్ర చేసి సింపతీ సంపాదించాడు. ఒక్క ఛాన్స్ అంటూ రిక్వెస్ట్ చేసి 2019 ఎన్నికల్లో 151 సీట్లు కొల్లగొట్టి రికార్డు సృష్టించారు. దాదాపు 85 శాతం సీట్లు ప్రజలు వైసీపీకి ఇచ్చారు. ఏదైనా అధ్భుతం చేస్తాడని , రాష్ట్రానికి ఏదైనా మేలు చేసి డెవలప్ చేస్తాడని అనుకున్నారు. విశ్వనగరం రేంజ్‌లో అమరావతిని డెవలప్ చేస్తాడని అంతా అనుకున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణను మించేలా డెవలప్‌మెంట్ అవ్వాలనే ఆశ ప్రజల్లో. ఐటీ, సినీ, నిర్మాణ, వ్యవసాయ, పరిశ్రమ వంటి రంగాల్లో గణనీయ అభివృద్ధితోనే అది సాకారమయ్యే ఛాన్స్ ఉంది. కానీ జగన్ డెవలప్‌మెంట్‌ను పట్టించుకోకుండా కేవలం సంక్షేమాన్నే ధ్యేయంగా ఎంచుకున్నారనే విమర్శలు ఉన్నాయి.
అధికారం ఇచ్చి ఐదేళ్లయినా ప్రజల ఆకాంక్ష నెరవేరలేదా? ఇంకా ఏం కావాలి? అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? గత ఎన్నికల్లో ఇచ్చిన మెజార్టీ కంటే ఇప్పుడు అత్యధికంగా 164 సీట్లు ఇవ్వడానికి రీజన్ ఏమయి ఉంటుంది? 2019, 2024 ఎన్నికల్లో ప్రజల తీర్పు పూర్తి ఏకపక్షంగా సాగింది. ఇంతలా డిసైడ్ అవ్వడానికి ప్రధాన కారణం రాష్ట్ర అభివృద్ది అశించిన మేర జరగకపోవడమేనా? 2019 లో ఛీ అని దూరం పెట్టి, పక్కకు నెట్టిన చంద్రబాబు నాయుడినే మళ్లీ ప్రజలు నమ్మారు. ఓటు వేసి భారీ విజయాన్ని అందించారు. ఒకసారి ఛాన్స్ ఇచ్చినా ఉపయోగించుకోని వ్యక్తి ఈసారి డెవలప్ చేస్తాడనే గ్యారంటీ ఉందా? అంతటి సమర్థత, తెగింపు చంద్రబాబుకు ఉన్నాయా? లేకపోతే పవన్ కల్యాణ్ లీడ్ తీసుకొని చక్రం తిప్పుతాడా? ఆవేశం, దూకుడుతనంతో స్పీడ్ పెంచుతాడా చూడాలి. అయిదేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో మళ్లీ ప్రజలు ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా ఉండాలనే అనుకుందాం.