ఈ మధ్య హోటల్ గదులలో రహస్య కెమెరాలు బయటపడుతున్నాయి. ప్రముఖ హోటళ్ల గదుల్లో కూడా ఇలాంటి తంతు సాగుతోంది. అందువల్ల మీరు హోటల్‌కి వెళ్తే రహస్య కెమెరాలను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం..
- హోటల్ గదిలో సీక్రెట్ కెమెరాలను మొబైల్ ఫోన్ కెమెరాతో గుర్తించవచ్చు. చాలా రహస్య కెమెరాలు చీకట్లో కూడా పనిచేసేలా వాటికి ఇన్‌ఫ్రారెడ్, LEDs ఉంటాయి. ఆ కెమెరాలను కనిపెట్టేందుకు ముందుగా గదిలో లైట్లన్నీ ఆఫ్ చెయ్యాలి. కర్టెన్లను మూసేసి, గదిని వీలైనంత చీకటిగా మార్చాలి. తర్వాత మొబైల్ కెమెరా ఆన్ చేసి, స్కాన్ చెయ్యాలి. ఆ సమయంలో మొబైల్ కెమెరా.. ఒక్కోసారి అక్కడేదో ఉన్నట్లుగా ఫోకస్ చేస్తుంది. అలా చేసిన చోట ఇన్‌ఫ్రారెడ్ కెమెరా ఉన్నట్లే.
- హిడెన్ కెమెరా డిటెక్టర్ యాప్‌లు గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్‌లో ఉంటాయి. అవి కూడా రహస్య కెమెరాలను స్కాన్ చేసి కనిపెట్టగలవు. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని, ఓపెన్ చేస్తే, ఆటోమేటిక్‌గా అది ఫోన్ కెమెరాని ఉపయోగించుకొని, రహస్య కెమెరాలను ఇట్టే కనిపెట్టి, ఎక్కడున్నాయో చెప్పేస్తుంది.
- మొబైల్ ఫోన్ ఫ్లాష్ లైట్ వేసి కూడా సీక్రెట్ కెమెరాలను కనిపెట్టవచ్చు. గదిలోకి వెళ్లాక ఫ్లాష్ లైట్ ఆన్ చెయ్యాలి. గదిలోని అద్దాలు, స్మోక్ డిటెక్టర్, వాల్ పెయింట్, పూల బొకే వంటి వాటిని లోతుగా, జాగ్రత్తగా గమనించాలి. ఫ్లాష్ లైట్ కాంతి, కెమెరాల లెన్స్‌పై పడినప్పుడు.. వెంటనే ఆ కెమెరా మీకు కనిపిస్తుంది.
- కొన్నిసార్లు రహస్య కెమెరాలు.. వైఫె నెట్‌వర్క్‌తో పనిచేస్తూ ఉంటాయి. అవి రికార్డ్ చేసే వీడియోని వైఫై ద్వారా ట్రాన్స్‌మిట్ చేస్తూ ఉంటాయి. అందువల్ల మీరు గదిలోకి వెళ్లాక.. అక్కడ వైఫై నెట్‌వర్క్స్ ఏవేవి ఉన్నాయో చూడండి. ఇందుకోసం మీరు WiFiman లేదా NetSpot వంటి నెట్‌వర్క్ స్కానర్ యాప్స్ కూడా వాడొచ్చు. వాటి ద్వారా మీకు ఏదైనా అనుమానాస్పదమైన నెట్‌వర్క్ కనిపిస్తే, దానిపై హోటల్ యాజమాన్యాన్ని ఆరా తియ్యవచ్చు.
- కొన్ని రహస్య కెమెరాలు డేటాను ప్రసారం చేయడానికి బ్లూటూత్‌ని ఉపయోగిస్తాయి. మీరు హోటల్ గదిలో బ్లూటూత్ పరికరాల కోసం స్కాన్ చేయడానికి మీ Android ఫోన్‌ని ఉపయోగించండి. అనుమానాస్పద పేరు లేదా పేరులేని పరికరం ఉన్న ఏదైనా ఉందేమో చూడండి. ఇలా కూడా రహస్య కెమెరాల ఆట కట్టించవచ్చు.
- హోటల్ గదిలో స్మోక్ డిటెక్టర్లు, గోడ గడియారాలు, పవర్ అవుట్‌లెట్‌లు, ఎయిర్ ప్యూరిఫైయర్‌లు, లైట్ బల్బులు వంటి ప్రదేశాలలో కెమెరాలను దాచే ఛాన్స్ ఉంటుంది. మీకు ఏవైనా అనుమానాస్పద పరికరాలు లేదా రహస్య కెమెరాలు ఉన్నట్లు కనిపిస్తే, హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించవచ్చు. తర్వాత పోలీసులకు కాల్ చేసి, కంప్లైట్ ఇవ్వొచ్చు.