Homeహైదరాబాద్latest Newsరింగు రోడ్డు ప్రమాదాల్లో.. సెలెబ్రిటీలే ఎక్కువ?

రింగు రోడ్డు ప్రమాదాల్లో.. సెలెబ్రిటీలే ఎక్కువ?

హైదరాబాద్ ఓఆర్ఆర్ పై నిత్యం ఏదో ఒక ప్రమాదం వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా సెలబ్రిటీలు, లేదా వారి వారసుల ప్రమాద వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. కోట శ్రీనివాస రావు, కోమటి రెడ్డి వారసుల నుంచి, నిన్నటి యువ నాయకురాలు లాస్య నందిత వరకు ఇలాంటి దుర్ఘటనల సంఖ్య పెరుగుతూనే ఉంది. అతి వేగంతో కూడిన డ్రైవింగ్‌, నిద్రమత్తు, నిర్లక్ష్యం వంటి కారణాలతో ఎంతో ఆయుష్షు ఉన్న జీవితాలు ఇలా గాలిలో కలిసిపోతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ మీద ఆక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయిన కొందరు సెలెబ్రిటీస్ ను నెమరు వేసుకుంటే.. ముందుగా.. జూన్ 20, 2010న జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో సీనియర్ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కుమారుడు వెంకటసాయి ప్రసాద్‌మృతి చెందారు. కోట వెంకట సాయిప్రసాద్‌ తన స్పోర్ట్స్‌ బైక్ ‌పై ఓఆర్ఆర్ నుంచి శంషాబాద్‌ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఓ వేడుకలో పాల్గొనేందుకు ఫిలింనగర్‌ నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్‌ హోటల్ ‌కు బయల్దేరి ప్రసాద్‌ తన స్పోర్ట్స్‌ బైకుపై ఒంటరిగా వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసు అకాడమీ దాటిన తరువాత దర్గా మలుపు వద్ద ఓ డీసీఎం రింగ్ రోడ్డు పైకి దూసుకొచ్చిన క్రమంలో బైక్ ‌పై వేగంగా వెళుతున్న ప్రసాద్‌ డీసీఎంను గమనించి హఠాత్తుగా బ్రేక్‌ వేశారు. దీంతో బైక్‌ రోడ్డును రాసుకుంటూ వెళ్లి డీసీఎం వ్యానును ఢీకొట్టింది. ప్రసాద్‌ ఎగిరి ఇరవై అడుగుల దూరంలో పడగా తలకు తీవ్ర గాయాలై మరణించారు. ఆ తరువాత ఔటర్ రింగ్ రోడ్డుపై బైక్ రేసింగ్‌ల్లో పాల్గొన్న భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ 19 ఏళ్ళ కొడుకు మొహమ్మద్ అయాజుద్దీన్ మృతి చెందాడు. బైక్‌పై నుంచి పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అయాజుద్దీన్ సెప్టెంబర్ 17, 2011న మృతి చెందాడు. దీంతో అజారుద్దీన్ కుటుంబంలో తీరని శోకం మిగిలింది. మెదక్ జిల్లా రామచంద్రపురం మండలం కొల్లూరు ఓఆర్ఆర్ వద్ద డిసెంబర్ 19, 2011 జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి మరణించారు. ప్రతీక్ రెడ్డితో పాటు సుచిత్ రెడ్డి, చంద్రారెడ్డి అనే యువకులు కూడా ఈ ప్రమాదంలో మరణించారు. వేగంగా వెళ్తున్న ప్రతీక్ రెడ్డి కారు డివైడర్‌కు ఢీకొట్టి నుజ్జు నుజ్జుయింది. హైదరాబాద్ నుంచి పటాన్‌చెరులోని ఓ మిత్రుడి ఇంటికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. సినీ రవితేజ సోదరుడు, నటుడు భూపతిరాజు భరత్ రాజు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భరత్ కన్నుమూశారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ఆగిఉన్న లారీని భరత్ ప్రయాణిస్తున్న స్కోడా కారు వెనుక నుంచి ఢీ కొట్టగా ఈ ప్రమాదంలో భరత్ ముఖం గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమైంది, ఆయన రవితేజ సోదరుడని గుర్తించలేకపోయారు. కారు నంబర్ ఆధారంగా భరత్‌ను గుర్తించారు. ఔటర్ రింగ్ రోడ్డు అంటే ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ప్రయాణాలు సులువుగా చేయడానికి, హైదరాబాద్ లోపల రద్దీని తగ్గించడానికి, త్వరగా గమ్యం చేరడానికి ఏర్పాటైన రింగ్ రోడ్డు, ప్రమాదాలకు నిలయంగా మారింది. రింగ్ రోడ్డుపై జరుగుతన్న ప్రమాదాలతో యేటా అనేకమంది మృత్యువాతపడుతున్నారు. అతి వేగం, నిర్లక్ష్యమైన డ్రైవింగ్, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వంటి కారణాల వల్ల ఈ ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

Recent

- Advertisment -spot_img