Homeహైదరాబాద్latest Newsధరణిలో ఇన్ని సమస్యలు ఉన్నాయా?.. కొత్త కమిటీ భేటీలో షాకింగ్ నిజాలు

ధరణిలో ఇన్ని సమస్యలు ఉన్నాయా?.. కొత్త కమిటీ భేటీలో షాకింగ్ నిజాలు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ధరణి భూ సమస్యలన్నింటికీ సంజీవని అని గత ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. కానీ ఈ పోర్టల్​ ఎంతో మంది రైతులకు కన్నీరు మిగిల్చింది. వారి ఉసురు పోసుకున్నది. కొన్ని లక్షల రైతు కుటుంబాల్లో చిచ్చు రేపింది. పట్టా రైతుకు తన భూమిని దూరం చేసింది. వారికి కష్టాలు తెచ్చిపెట్టింది. ఒక్క దెబ్బతో భూ సమస్యలు మొత్తం పరిష్కరించేస్తామని అప్పటి కేసీఆర్​ ప్రభుత్వం ఎంతో గొప్పగా ఈ పథకాన్ని మొదలుపెట్టింది. 2020 అక్టోబర్​ 29న మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి గ్రామంలో ధరణి పోర్టల్​ ప్రారంభమైంది. అదే ఏడాది నవంబర్​ 2 నుంచి ధరణి పోర్టల్​ కార్యకలాపాలు అధికారికంగా మొదలయ్యాయి. ఈ పోర్టల్​తో చాలా మంది భూ రికార్డులు డిజిటల్​ అయ్యాయి. కానీ కొంతమంది పట్టా రైతుల భూములు గాయబ్​ అయ్యాయి. తాము కాస్తులో ఉన్నా .. మరొకరి పేరు మీదికి భూమి మారిపోయింది. కొంతమంది భూములు ప్రభుత్వ భూములుగా, అటవీ భూములుగా, చెరువు శిఖం భూములుగా రికార్డుల్లోకి ఎక్కాయి. ధరణి వల్ల 30 రకాల సమస్యలు వచ్చినట్టు గతంలో ధరణి సమస్యల మీద వేసిన కమిటీ గుర్తించింది. ఒకరి పేరు మీదున్న భూమి మరొకరి పేరు మీద నమోదు కావడం. పట్టా భూమి నిషేధిత జాబితాలో చేరడం.. రైతుల భూ విస్తీర్ణం తక్కువగా చూపించడం వంటి 33 సమస్యలను గత ప్రభుత్వం వేసిన కమిటీ గుర్తించింది. తాజాగా కొత్తగా రేవంత్ సర్కారు ధరణి సమస్యల మీద వేసిన కమిటీ 35 సమస్యలను గుర్తించింది. దీంతో ఆయా రైతులు అరిగోస అనుభవించారు. అయితే ధరణి పోర్టల్​లో మొత్తంలో అతిపెద్ద చిక్కు.. ఒక్కసారి భూమి ఆ పోర్టల్​ల్లో తప్పుగా నమోదైతే .. జేజమ్మ దిగి వచ్చినా సరికాదు. అందుకే రైతులు నానా తంటాలు పడ్డారు. ఇప్పటికీ పడుతున్నారు. ఓ రైతు భూమి తప్పుగా నమోదైతే సదరు రైతు తొలుత మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలి. ఫైల్​ అక్కడి నుంచి కలెక్టర్​ ఆఫీసుకు బదిలీ అవుతుంది. ఫీల్డ్​ సర్వే కోసం ఫైల్​ అక్కడి నుంచి తహసీల్దార్​ ఆఫీసుకు వస్తుంది. అక్కడ కూడా సమస్య పరిష్కారం కాదు. ఫీల్డ్​ సర్వే చేసిన తహసీల్దార్​ సదరు ఫైల్​ ను ఆర్డీవో ఆఫీసుకు పంపాలి. ఆర్డీవో కార్యాలయం నుంచి ఆఫైల్​ కలెక్టర్​ ఆఫీసుకు చేరుకుంటుంది. సమస్య జెన్యూన్​ అని తేలితే కలెక్టర్​ సీసీఎల్​ కే పంపిస్తారు. వారు దయతలిస్తే భూమి ఉన్నట్టు .. లేదంటే సీసీఎల్​ఏ సదరు ఫైల్​ ను రిజెక్ట్​ చేస్తే మళ్లీ సమస్య మొదటికి వస్తుంది. ఈ ప్రక్రియతో రైతులు విసుగెత్తిపోయారు. ధరణి సమస్యల మీద దాదాపు 15 లక్షల దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వీటిలో కొన్ని పరిష్కారమయ్యాయి. మరికొన్ని రిజెక్ట్​ అయ్యాయి. కొన్ని పెండింగ్​ లో ఉన్నాయి. 15 లక్షల దరఖాస్తుల్లో 5 నుంచి 6 లక్షల దరఖాస్తులు అకారణంగా రిజెక్ట్​ అయ్యాయి. సీసీఎల్​ఏ ధరణి దరఖాస్తుల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. ధరణి సమస్యలకు సంబంధించి రైతులు పెట్టుకున్న దరఖాస్తులు జెన్యూన్​ అని తహసీల్దార్​ తేల్చినా సీసీఎల్​ ఏ రిజెక్ట్​ చేసింది. కొంతమంది ప్రభుత్వ భూమిని తమ భూమికి చెప్పుకొని దరఖాస్తు చేసుకున్నా సీసీఎల్ఏ ఒకే చేసింది. ఇలా సీసీఎల్ఏ​ దరఖాస్తులను ఎందుకు రిజెక్ట్​ చేస్తుంది? ఎందుకు ఓకే చేస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. ఒకే సమస్య కోసం రైతులు చాలా సార్లు దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది. ధరణి బాధితులు ఫీజు రూపంలోనే దాదాపు రు. 100 కోట్లు చెల్లించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

కేసీఆర్​ మానసపుత్రిక.. రైతుల పాలిట శాపం
బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​.. ధరణి పథకాన్ని, కాళేశ్వరం ప్రాజెక్టును తన మానసపుత్రికలుగా చెప్పుకుంటూ ఉంటారు. భూమి మీద సర్వహక్కులు రైతులకు ఇచ్చేందుకు ఈ పోర్టల్​ తీసుకొచ్చానని ఎన్నో సందర్భాల్లో ముఖ్యమంత్రి స్వయంగా చెప్పుకున్నారు. కానీ ఈ పథకం బాధితులు ఎంతో మంది. తమ భూమి ధరణి రికార్డుల్లోకి ఎక్కక.. తమ సమస్యలు ఎలా పరిష్కరించాలో అర్థం కాక అన్నదాతలు తీవ్ర మనోవేధనకు లోనయ్యారు. గత ప్రభుత్వం మీద ధరణి బాధితులు శాపనార్థాలు పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ధరణి బాధితులు ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తరతరాలు తాను సాగుచేసుకుంటున్న పట్టా భూమి ఒక్కసారి పరాధీనమయ్యేసరికి రైతుల బాధలు వర్ణణాతీతం. ప్రభుత్వ అధికారుల తప్పిదాల వల్ల ధరణిలో తమ భూమి తప్పుగా రికార్డ్​ అయితే .. సదరు రైతు తలకిందుల తపస్సు చేసినా ఆ సమస్య పరిష్కారం కాలేదు.

చాయ్​, బిస్కట్​ కమిటీ
తాను ఎంతో గొప్పగా భూసమ్యలు పరిష్కరించేందుకు .. తీసుకొచ్చానని కేసీఆర్​ భావించే పోర్టల్​ లో ఎన్నో సమస్యలు మొదలయ్యాయి. అప్పట్లో మీడియాలో ఈ పోర్టల్​ కు సంబంధించిన సమస్యలు కథలు, కథలుగా వచ్చాయి. చివరకు ధరణి పోర్టల్​ లో ఉన్న సమస్యలు ఉన్నట్టు అప్పటి సీఎం కేసీఆర్​ దృష్టికి వెళ్లింది. నిజంగానే సమస్యలు ఉన్నాయా? అని తెలుసుకొనేందుకు సిద్దిపేట జిల్లా ములుగు గ్రామాన్ని పైలట్​ ప్రాజెక్టుగా చేసుకొని సమస్యలు తెలుసుకొనేందుకు ప్రభుత్వ యంత్రంగా వెళ్లింది. అప్పటి సీఎస్ సోమేశ్​ కుమార్​, అప్పటి మంత్రి హరీశ్​ రావు, జిల్లా కలెక్టర్, రెవెన్యూ యంత్రాంగం అంతా ములుగు తరలివెళ్లింది. ముందుగా ధరణి గొప్ప ప్రాజెక్టు అని అధికారులు, హరీశ్​ రావు ఊదరగట్టారు. అయితే అదే గ్రామంలో ధరణి బాధితులు తిరగబడ్డారు. ఆ గ్రామంలో మొత్తం 272 ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ధరణిలో సమస్యలు ఉన్నాయని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం.. 2021లో ధరణి సమస్యల పరిష్కారానికి హరీశ్​ రావు, జగదీశ్​ రెడ్డి, నిరంజన్​ రెడ్డి, తలసాని, వేముల ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో ఓ కమిటీని వేసింది. ఈ కమిటీ ఏ సమస్యను పరిష్కరించలేపోయింది. దద్దమ్మల కమిటీగా నిలిచిపోయింది. పైగా సదరు కమిటీ సభ్యులు ఎక్కడికి వెళ్లినా ధరణి పోర్టల్​ లో ఏ సమస్యలు లేవని.. మెజార్టీ రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పడం మొదలుపెట్టారు. దీంతో బాధిత రైతులకు బాధలు మొదలయ్యాయి. కేసీఆర్​ సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితి ఉంటుందో.. ఎన్ని సమస్యలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కానీ అప్పటి సర్కారు చిత్తశుద్ధితో ఈ సమస్యను పరిష్కరించలేకపోయింది. పైగా ఎక్కడికెళ్లినా మంత్రులు, ఎమ్మెల్యేలు ధరణిని వేనోళ్ల పొగిడేవారు. ఇక సీఎం కేసీఆర్​ అయితే ఆకాశానికి ఎత్తేవారు. మొత్తంగా ధరణి తప్పులతడకగా మారిపోయింది. ఇక గత సర్కారు సమస్యల పరిష్కారానికి 9133089444 వాట్సాప్​ నంబర్​ కూడా ఇచ్చింది. ఈ వ్యాట్సాప్​ నంబర్​ పనిచేయలేదు. రైతుల సమస్యను పరిష్కరించలేదు. కమిటీ మాత్రం చాయ్​, బిస్కట్​ కమిటీగానే మిగిలిపోయింది.

చేయని తప్పుకు రుసుం ఎందుకు కట్టాలి?
కేవలం అధికార యంత్రాంగం తప్పుల వల్లే ధరణిలో అనేక సమస్యలు వెలుగుచూశాయి. తెలంగాణ పల్లెల్లోని అన్ని గ్రామాల్లో కొన్ని లక్షల మంది రైతుల పట్టాభూమి డిజిటల్​ రికార్డుల్లోకి ఎక్కలేదు. పైగా ప్రభుత్వ భూమిగానో.. ఇతరుల పేరుమీదకు ట్రాన్స్​ ఫర్​ అయ్యింది. కొంతమంది రైతుల భూమి ఇతరుల పేరుమీద ఉండిపోయింది. వారు రైతు బంధు కూడా తీసుకున్నారు. ఇదేంటని రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తే.. సదరు రైతు మీకు రిజిస్ట్రేషన్​ చేస్తే తప్ప మీ సమస్య పరిష్కారం కాదని అధికారులు తేల్చిచెప్పారు. పైగా ధరణిలో తప్పుగా భూమి నమోదైతే దానికి సంబంధిత రైతులే రూ. 1,100 వేలు రుసుం చెల్లించాల్సి వచ్చేది. ఒకసారి ఈ ఫైల్​ అన్ని గండాలు దాటుకొని చివరకు సీసీఎల్​ఏకే వెళితే అక్కడ కూడా రిజెక్ట్​ అవుతుంది. మళ్లీ సమస్య మొదటకి వస్తుంది. మరోసారి రైతులు మీ సేవను ఆశ్రయించి రూ. 1,100 కట్టాల్సిందే. ఇలా ఒక్కోరైతు ఎన్నో సార్లు అప్లై చేసుకున్నారు. కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వెళ్లింది. కానీ సమస్య పరిష్కారం కాలేదు. తమ భూరికార్డులు తప్పుగా నమోదైతే ఏం చేయాలో కూడా కొంతమంది రైతులకు తెలియదు. దీంతో పైరవీకారులను, దళారులను నమ్మి ఎంతోమంది రైతులు మోసపోయారు. బ్రోకర్లకు, దళారులకు డబ్బు ముట్టజెప్పి కూడా రైతులు మోసపోయారు. 15 లక్షల అప్లికేషన్లు సీసీఎల్​ఏ వరకూ వెళితే వాటిలో దాదాపు 5 లక్షలు రిజెక్ట్​ అయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చేయని తప్పుకు రైతు ఎందుకు రుసుం చెల్లించాలన్న ప్రశ్న ఉత్పన్నమైంది. డబ్బు కట్టినా సదరు ఫైల్​ రిజెక్ట్​ అయితే ఎక్కడా చెప్పుకొనే దిక్కు కూడా లేదు. ప్రభుత్వం రైతుల మీద కక్ష గట్టిందా? అన్నట్టు పరిస్థితి మారిపోయింది.

ఇది మచ్చుకు ఓ రైతు వ్యథ..
ఏ గ్రామం నుంచి కేసీఆర్​ సర్కారు ధరణి పోర్టల్​ ను ప్రారంభించారో.. అదే గ్రామానికి చెందిన ఓ రైతు వ్యథ ఇది. మేడ్చల్​ జిల్లా శామీర్​పేట మండలం కేసీఆర్ దత్తత గ్రామమైన మూడుచింతలపల్లి పరిధిలోని లక్ష్మాపూర్​ లో ఓ రైతుకు 15 ఎకరాల పట్టా భూమి ఉంది. కానీ సదరు రైతు పట్టాభూమి ధరణిలో భూమి ప్రభుత్వ భూమిగా నమోదైంది. దీంతో తన సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కానీ రైతు ధరణి సమస్యల పరిష్కార పద్థతిని తెలుసుకొని ముందుగా మీ సేవలో అప్లై చేసుకున్నాడు. ఫైల్​ కలెక్టర్​ ఆఫీసుకు వెళ్లింది. రైతు కలెక్టర్​ కార్యాలయానికి వెళ్లి కలిశాడు. అక్కడి నుంచి కలెక్టర్​ ఆ ఫైల్​ను తహసీల్దార్​ కార్యాలయానికి పంపించి ఫీల్డ్​ సర్వే చేయాలని ఆదేశించారు. తహసీల్దార్​ ఫీల్డ్​ సర్వే చేసి రైతు సమస్య జెన్యూన్​ అని తేల్చారు. దీంతో ఈ ఫైల్​ తహసీల్దార్​ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయానికి.. అక్కడి నుంచి మళ్లీ కలెక్టర్​ ఆఫీసుకు చేరుకున్నది. ఇక కలెక్టర్​ ఆ దరఖాస్తును సీసీఎల్​ఏకు పంపించారు. ఇప్పటికీ సీసీఎల్​ఏ దగ్గర ఆ దరఖాస్తు పెండింగ్​లో ఉంది. ధరణిలో ఏ రైతుకు సమస్య వచ్చినా ఇటువంటి ప్రహసనం మాములే. ఇంత చేసినా చివరకు సమస్య పరిష్కారం అవుతుందన్న గ్యారెంటీ లేదు. ఇటువంటి లక్షల పెండింగ్​ ఫైల్స్​ సీసీఎల్​ఏ దగ్గర ఉన్నాయి. దాదాపు 15 లక్షల ఫైల్స్​ సీసీఎల్​ వద్దకు చేరుకుంటే అక్కడ 5 లక్షల ఫైల్స్​ రిజెక్ట్ అయ్యాయి. ఒక్కసారి ఫైల్​ రిజెక్ట్​ అయ్యిందంటే మళ్లీ మొదటికి రావాల్సిందే. మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు చేసి ఫైల్స్​ మాత్రమే సీసీఎల్​గా దగ్గర ఆమోదం పొంది సమస్యలు పరిష్కరాం అవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

సమస్యలు ఉన్నాయని తెలిసినా..
ధరణి పోర్టల్​ లో అనేక సమస్యలు ఉన్నాయని.. అప్పటి ప్రభుత్వం వేసిన కమిటీకి, రెవెన్యూ అధికారులకు కూడా తెలుసు. అనేక దరఖాస్తులు పెండింగ్​ లో ఉండటమే ఇందుకు నిదర్శనం. అయితే ఈ పథకం కేసీఆర్​, సోమేశ్​ కుమార్​ దగ్గరుండి మరీ రూపొందించారని చెబుతుంటారు. ధరణి యాప్​ వల్ల భూ సమస్యలు మొత్తం పరిష్కారం అయ్యాయని కేసీఆర్​ బలంగా నమ్మేవారు. అందుకే ఈ పోర్టల్​ కు సంబంధించి తప్పిదాలను ఎవరూ నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లలేదు. మొత్తంగా పిల్లి మెడలో గంట వేసేందుకే ఏ అధికారికి, మంత్రికి సాహసం చాలలేదు. వెరసి ధరణి సమస్యలు రోజురోజుకు పేరుకుపోయాయి. తప్ప సమస్యలు పరిష్కారం కాలేదు.

రేవంత్​ సర్కారు కమిటీ
ధరణి యాప్​ తో అనేక సమస్యలు ఉన్నాయని గుర్తించిన రేవంత్​ సర్కారు ఈ సమస్యను పరిష్కరించేందుకు ఓ కమిటీ వేసింది. ఈ కమిటీలో కన్వీనర్‌తోపాటు నలుగురు సభ్యులను నియమించింది. సీసీఎల్​ఏ నవీన్‌ మిట్టల్‌కు కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించారు. కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్‌, భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌గా పని చేసిన రేమండ్‌ పీటర్‌లకూ కమిటీలో సభ్యులుగా స్థానం కల్పించారు. భూ చట్టాల నిపుణుడు అడ్వకేట్ సునీల్‌ రెవెన్యూ చట్టాలపై అవగాహన ఉన్న రిటైర్డ్ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ బీ మధుసూదన్‌లను కూడా కమిటీలో నియమించారు. ఈ కమిటీ ఇటీవలే రెండో సారి భేటీ అయ్యింది. భూ సమస్యల పరిష్కారానికి అవసరమైతే ఫీల్డ్​ సర్వే చేస్తామని కమిటీ సభ్యుడు కోదండరెడ్డి చెప్పారు. ఇక ధరణి స్థానంలో ‘భూమాత’ పోర్టల్ తీసుకొస్తామని ఇప్పటికే కాంగ్రెస్​ సర్కారు వెల్లడించింది. ఈ క్రమంలోనే ముందుగా సమస్యలను గుర్తించేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలకు కారణమైన పోర్టల్‌ ప్రక్షాళనకు సిద్ధమయ్యారు. పోర్టల్‌లో టెక్నికల్‌గా అనేక సమస్యలు ఉన్నాయని ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. సాగు భూముల రిజిస్ట్రేషన్లు – మ్యుటేషన్ల ప్రక్రియను పోర్టల్‌ ద్వారా ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. పోర్టల్​ల్లో భూముల ఖాతాలు ఉన్న వారికే పట్టా పాసు పుస్తకాల జారీ కొనసాగుతోంది. రేవంత్​ సర్కారు తమ సమస్యలు తీరుస్తుందని ధరణి బాధితులు వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. ధరణి సమస్యలు పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడంతో పాటూ అవినీతికి తెరలేపాడని సీసీఎల్​ఏ​ నవీన్​ మిట్టల్​ మీద ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు తాజాగా రేవంత్​ సర్కారు వేసిన కమిటీకి ఆ అధికారే కన్వీనర్​ కావడం గమనార్హం. మరి ఈ కమిటీ తమ సమస్యలు పరిష్కరించాలని బాధితులు నమ్మకంగా ఉన్నారు. సర్కారు దరణి బాధితులకు ఎటువంటి ఊరట ఇస్తుందో వేచి చూడాలి. పాత పద్ధతిలోనే భూ సమస్యలను పరిష్కరిస్తే బాగుంటుందని రైతులు కోరుకుంటున్నారు.

రైతులు ఏం కోరుకుంటున్నారు?
ధరణి సమస్యల పరిష్కారానికి దరఖాస్తు చేసుకోవాలంటే ప్రస్తుతం రుసుం వసూలు చేస్తున్నారు. ఈ ఫీజును ఎత్తేయాలని రైతులు బలంగా కోరుకుంటున్నారు. ‘పరిష్కారం అయ్యే సమస్యలన్నింటినీ పరష్కరించాలి. ఈ సమస్యను పరిష్కరించే అధికారం తహసీల్దార్​ కే ఇవ్వాలి. గతంలో ధరణి సమస్యల కోసం గతంలో కట్టిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలి. గత ప్రభుత్వంలో సీసీఎల్​ఏగా ఉన్న నవీన్​ మిట్టల్​ ప్రస్తుతం కొనసాగుతున్నారు. రేవంత్​ సర్కారు వేసిన కమిటీకి కూడా ఆయన కన్వీనర్ గా ఉన్నారు. ఆయన సారథ్యంలో సమస్యలు పరిష్కారం అవుతాయా? అని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం వేసిన కమిటీ ధరణికి సంబంధించి 33 సమస్యలను గుర్తిస్తే.. తాజా సర్కారు 35 సమస్యలను గుర్తించింది. దీంతో ఈ సమస్యలన్నింటిని పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img