Homeలైఫ్‌స్టైల్‌ఇయర్ బడ్స్‌తో చెవిలో గులిమి తీస్తున్నారా.. అయితే ప్ర‌మాదంలో ప‌డ్డ‌ట్టే… #Ear #EarBuds

ఇయర్ బడ్స్‌తో చెవిలో గులిమి తీస్తున్నారా.. అయితే ప్ర‌మాదంలో ప‌డ్డ‌ట్టే… #Ear #EarBuds

చెవిలోంచి వచ్చే గులిమి మనకు చాలా చిరాకు కలిగిస్తుంటుంది.

నిజానికి గులిమి అనేది మన చెవి నుంచి సహజంగా వెలువడే మలిన పదార్థం.

గులిమి తీసుకుంటూ చెవులను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ఉండాలి. ఇది తేలికగా తీసుకోవాల్సిన విషయం కాదు.

మనలో చాలామంది అగ్గిపుల్లలకు దూది చుట్టి, పిన్నీసులు పెట్టి గులిమి తీసుకుంటూ ఉంటారు. ఈ పద్ధతులు మంచివేనా? లేక వీటి వల్ల హాని కలుగుతుందా?

ఒక్కోసారి ఇయర్ బడ్స్‌తో తీసుకున్నా చెవి లోపల నొప్పెడుతున్నట్లు ఉంటుంది. అసలు చెవిలో గులిమి తీసుకోవడానికి కాటన్ బడ్స్ వాడొచ్చా?

గులిమి తొలగించడానికి ఉత్తమ పద్ధతి ఏంటి? హాని కలిగించే పనులేంటి?

గులిమి పని ఏమిటి?

గులిమి చెవి లోపలి గ్రంథుల్లో ఉత్పత్తి అవుతుంది. దీనికి అనేక విధులు ఉంటాయని బ్రిటన్‌కు చెందిన ఈఎన్‌టీ స్పెషలిస్ట్ డాక్టర్ గ్యాబ్రియల్ వివరించారు.

  • చెవులను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
  • చెవుల్లో ఉన్న నాళాలు ఎండిపోకుండా, పగుళ్లు రాకుండా కాపాడుతుంది.
  • ధూళికణాలు, నీరు చెవిలోపలికి పోకుండా రక్షిస్తుంది.
  • ఎలాంటి వ్యాధులూ సోకకుండా అరికడుతుంది.
  • యాంటీ బ్యాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షణాలు గుమిలిలో ఉంటాయి.
  • చాలావరకు చెవుల్లో నాళాలు వాటిని అవే శుభ్రపరచుకుంటూ ఉంటాయి.

గులిమి ఎప్పుడు సమస్యగా మారుతుంది?

మనం మాట్లాడుతున్నప్పుడు లేదా నములుతున్నప్పుడు దవడలు కదులుతాయి కదా, ఈ దవడల కదలికల వలన చెవి లోపల ఉన్న గులిమి మెల్లిమెల్లిగా కదులుతూ చెవి రంధ్రం ద్వారం వైపు వస్తుంటుంది. సాధారణంగా ఇది ఎండిపోయి బయటకు వస్తుంది.

సాధారణ పరిస్థితిల్లో కొంచం కొంచంగా బయటకు వచ్చే గులిమి పెద్ద సమస్య కాదు.

కానీ ఈ గులిమి బాగా ఎక్కువైతే, చెవులకు అవరోధంగా మారుతుంది. చెవి నొప్పి, వినికిడి తగ్గిపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి.

చెవులను శుభ్రపరిచే ఉత్పత్తులు మార్కెట్లో చాలా కనిపిస్తుంటాయి. గులిమిని తొలగించి చెవులను శుభ్రపరచడంలో వేటికవే ఉత్తమమైనవని ప్రచారం చేసుకుంటూ ఉంటాయి.

అయితే నిజంగానే ఇవి సహాయపడతాయా? వీటి పని తీరు ఉత్తమంగా ఉంటుందా? అనే సందేహాలు మనకు వస్తుంటాయి.

అవేమిటి? వాటి లాభాలు, నష్టాలు పరిశీలిద్దాం.

ఇయర్ బడ్స్ లేదా కాటన్ బడ్స్

కొంతమంది చిటికెన వేలు చెవి లోపలికి దూర్చి గులిమి తీసుకుంటూ ఉంటారు.

ఇది మంచి పద్ధతి కాదు. దీనివలన అనేక సమస్యలు వస్తాయి.

అయితే దూదితో శుభ్రం చేసుకోవడం ఇంకా ప్రమాదకరం.

మనలో చాలామంది కాటన్ బడ్స్‌తో చెవులు శుభ్రం చేసుకుంటూ ఉంటాం.

కానీ వాటిని చెవి నాళిక (ear canal)ల్లో ఉపయోగించవద్దని వాటిని ఉత్పత్తి చేసే సంస్థలు హెచ్చరిస్తాయి. అది మీరెప్పుడైనా గమనించారా?

ఈసారి మీరు ఇయర్ బడ్స్ కొనాలనుకునే ముందు ఆ ప్యాకెట్‌పై ఏం రాసుందో ఓసారి చదవండి.

వాటిపై “కాషన్: డు నాట్ ఇన్సర్ట్ ఇన్ టు ది ఇన్నర్ ఇయర్” అని రాసుంటుంది.

అంటే “చెవి లోపలికి దూర్చకూడదు” అని ఆ కంపెనీలే హెచ్చరిస్తున్నాయి.
ఈ ఇయర్ బడ్స్ చెవుల్లో పెట్టుకోవడం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే గులిమిని ఇంకా లోపలికి తోసేస్తున్నాం. దాని వలన వాటంతట అవి శుభ్రం కాని చెవి లోపలి భాగాలకు మలినం అంటుకుపోతుంది.

చెవి బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా గులిమి పైన చేరే ప్రమాదం ఉంటుంది. ఇయర్ బడ్స్ పెట్టి గులిమిని లోపలికి తోసేస్తే బయట కూడా బ్యాక్టీరియా లోపలికి పోయి చెవులకు హాని కలిగించే ప్రమాదం ఉంది.

ఒక్కోసారి కాటన్ బడ్స్‌తో గులిమి తీసుకున్నప్పుడు చెవిపైన చర్మం మండుతుంది లేదా దురద పెడుతుంది. అక్కడ మనం మళ్లీ గోక్కోవడమో, రాపిడి కలిగించడమో చేస్తూ ఉంటే అక్కడ తిరిగి బ్యాక్టీరియా చేరవచ్చు. దానివలన మళ్లీ చెవి నొప్పి వస్తుంది. ఇదొక విషవలయంలా తయారవుతుంది.

కాటన్ బడ్‌ను గట్టిగా లోపలికి దూర్చితే కర్ణభేరికి దెబ్బ తగలవచ్చు. దానివలన నొప్పి, రక్తం కారడం, చెవులు సరిగ్గా వినిపించకపోవడం లాంటి సమస్యలొస్తాయి.

ఇయర్ క్యాండిల్స్

గులిమిని తొలగించుకోవడానికి ఇయర్ క్యాండిల్స్ మార్కెట్లో లభిస్తుంటాయి. వీటి ద్వారా సులభంగా మలినాన్ని తొలగించుకోవచ్చని ప్రచారం చేస్తుంటారు.

ఈ పద్ధతిలో సన్నని, పొడవైన, మండుతున్న కొవ్వొత్తి లాంటిదాన్ని, మధ్యలో రంధ్రం ఉండి శంఖం ఆకారంలో ఉన్న ఒక సాధనంపై ఉంచుతారు. ఆ రంధ్రంలోంచి కొవ్వొత్తిని చెవిలో పెట్టుకోవాలి.

దీనివలన చెవిలో గులిమి, ఇతర మలినాలు తొలగిపోతాయని చెబుతారు.

అయితే వీటి వలన ఏం ప్రయోజనం లేదని, పైగా చెవులకు ప్రమాదమని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇయర్ క్యాండిల్స్ వలన చెవి, మొహం కాలిపోవచ్చు. మైనం చెవుల్లో పడి కర్ణభేరి పూర్తిగా పాడైపోవచ్చు.

చెవిలో చుక్కలు లేదా ఇయర్ డ్రాప్స్

చెవుల్లో డ్రాప్స్ వేసుకోవడం ఉత్తమమైన మార్గమని చాలామంది భావిస్తారు.

డ్రాప్స్ వేసుకుంటే గులిమి మెత్తబడి సులువుగా బయటకి వచ్చేస్తుందని నమ్మకం.

మార్కెట్లో చాలా రకాల ఇయర్ డ్రాప్స్ లభ్యమవుతుంటాయి. వీటిల్లో ప్రధానంగా హైడ్రోజన్ పెరాక్సైడ్, సోడియం బైకార్బోనేట్ లేదా సోడియం క్లోరైడ్ వాడతారు.

ఈ డ్రాప్స్ బాగా పని చేసినా సున్నితమైన చర్మం ఉన్నవారికి ఇవి చిరాకు కలిగిస్తాయి. వీటి వలన చర్మంపై మంట, దురదల్లాంటివి రావొచ్చు.

ఖరీదైన ఈ కెమికల్స్‌కు బదులు ఆలివ్ లేదా ఆల్మండ్ (బాదం) నూనె చుక్కలు బాగా పని చేస్తాయి.

ఆలివ్ లేదా అల్మండ్ నూనె చుక్కలను గోరువెచ్చగా వేడి వేసి, ఓ పక్కకు తిరిగి పడుకుని చెవిలో వేసుకోవాలి.

కంట్లో చుక్కలు వెసుకునే ఐ డ్రాపర్ సహాయంతో మెల్లిగా పిండుతూ కొన్ని చుక్కలు చెవిలో వేసుకుని 5 లేదా 10 నిమిషాలు అలాగే పడుకోవాలి.

ఆలివ్ నూనె వలన చర్మానికి ఏ ఇబ్బందీ కలగదు. కానీ గులిమిని కరిగించడానికి ఇది ఎక్కువ సమయం తీసుకుంటుంది.

చెవి బ్లాక్ అయినట్టు అనిపిస్తే, రోజుకు రెండు, మూడు సార్లు నూనె చుక్కలు వేసుకోవాలి. ఇలా మూడు, నాలుగు రోజులు చేస్తే చెవుల్లో గులిమి మెత్తబడి సులువుగా బయటకు వచ్చేస్తుంది.

నీళ్లతో శుభ్రం చేసుకోవడం

గులిమితో సమస్యలు పెరుగుతుంటే నీటితో శుభ్రం చేయమని డాక్టర్లు సలహా ఇస్తుంటారు.

నీళ్లను వేగంగా చెవుల్లోకి కొట్టే ఈ పద్ధతిని వైద్యశాస్త్రంలో ‘సిరంజింగ్’ అంటారు.

సిరంజిలా ఉండే ఒక సాధనంతో నీటిని చెవుల్లోకి కొడతారు. దాంతో గులిమి అంతా బయటకు వచ్చేస్తుంది.

దీనివలన ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొన్నిసార్లు నీళ్లు కొట్టేటప్పుడు నొప్పెట్టొచ్చు. కర్ణభేరి పాడయ్యే ప్రమాదం కూడా ఉంది.

మైక్రోసక్షన్

కొన్ని క్లినిక్‌లలో గులిమి తీసేందుకు మైక్రోసక్షన్ పద్ధతిని ఉపయోగిస్తారు.

మైక్రోస్కోప్‌తో చెవి లోపలికి చూస్తూ మెల్లిగా గులిమిని బయటకు తీస్తారు.

గులిమి సమస్యలు అధికంగా ఉన్నవారికి ఈ పద్ధతి సురక్షితమైనది.

Recent

- Advertisment -spot_img