– గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు ఎల్బీస్టేడియంలో సీఎంగా ప్రమాణ స్వీకారం
– ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్
– తరలిరానున్న కాంగ్రెస్ అగ్ర నేతలు
– ఇతర రాష్ట్రాలకు సీఎంలకు ఇన్విటేషన్
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే, ప్రమాణ స్వీకార సమయంలో మార్పు జరిగింది. గురువారం ఉదయం 10.28 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయాలని తొలుత నిర్ణయించగా.. తాజాగా ఆ సమయాన్ని కాస్త ముందుకు జరిపారు. గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు బుధవారం కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్యనేతలు, కార్యకర్తలు తరలి రానున్నారు. రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా అధిష్ఠానం ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రేవంత్‌రెడ్డి చాలా ఏళ్లుగా జూబ్లీహిల్స్ రోడ్ నం. 44లో నివాసముంటున్నారు. ప్రస్తుతానికి అక్కడే ఉండాలని ఆయన యోచిస్తున్నట్లు తెలిసింది. సమీపంలోని 44ఎ రోడ్లోనే రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి ఎంపీ సెగ్మెంట్ ఆఫీసును ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే కొన్ని రోజులు ప్రజా దర్బార్ నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలని పోలీసులకు సూచనప్రాయ సమాచారం అందింది. అందుకు అనుగుణంగా మంగళవారం రాత్రి పోలీసులు బందోబస్తు, ఇతర ఏర్పాట్లు చేశారు. జూబ్లీహిల్స్ ఏసీపీ హరిప్రసాద్, ఇన్‌స్పెక్టర్ రవీంద్ర ప్రస్తుతం భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో విద్యుదీకరణ, రహదారుల శుభ్రత, ఇతర పనులు పూర్తిచేసే దిశగా జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు.
సాయుధ బలగాలతో బందోబస్తు..
కాబోయే సీఎం ఇంటికి తరలివచ్చే కార్యకర్తలు, అభిమానులను అదుపు చేసేందుకు ప్రస్తుతం సివిల్ పోలీసులను ఉపయోగిస్తామని, తర్వాత దశలో సాయుధ బలగాలు బందోబస్తులో పాల్గొంటాయని పోలీస్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసుల ఆధ్వర్యంలో రెండు ప్లటూన్ల బలగాలను విధుల్లో ఉంచామన్నారు. ఇవాళ్టి నుంచి వారికి అదనంగా సాయుధ సిబ్బంది, స్థానిక పోలీసులు అంచెలంచెలుగా విధుల్లో ఉంటారని చెప్పారు. రేవంత్‌రెడ్డి ఇంటికి సమీపంలో పెద్దమ్మ గుడి, ఓ సినీ నటుడి నివాసం ఉన్నాయి. ఆలయం వద్ద నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ పరిస్థితులన్నింటిపై రాష్ట్రస్థాయి పోలీసు అధికారులు సమీక్షించి తగిన ఏర్పాట్లకు ఆదేశించనున్నారు.
టీడీపీ చీఫ్ చంద్రబాబుకు ఆహ్వానం
రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి రావాలంటూ ఏఐసీసీ నేతలకు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు పీసీసీ ఆహ్వానాలు పంపింది. ఏపీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్, టీడీపీ చీఫ్ చంద్రబాబును ఆహ్వానించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకలను రేవంత్‌రెడ్డే ఢిల్లీ వెళ్లి స్వయంగా ఆహ్వానించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆ రాష్ట్ర మంత్రులకు ఆహ్వానాలు పంపారు. సీనియర్ నేతలు చిదంబరం, అశోక్ గెహ్లాట్, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, మీరాకుమార్, కుంతియా, భూపేష్ బఘేల్, అశోక్ చవాన్, వాయలార్ రవి, సుశీల్‌కుమార్ షిండే, మాణికం ఠాగూర్, కురియన్ను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. వీరితో పాటు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానం పంపారు. టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్, గాదె ఇన్నయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, కంచె ఐలయ్యతో పాటు వివిధ కులసంఘాల నేతలను ఆహ్వానించారు. ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా పలువురు సినీ ప్రముఖులకు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆహ్వానాలు పంపారు.
ఢిల్లీలో బిజి బిజీగా రేవంత్
రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కలుస్తూ బిజీ బిజీగా ఉన్నారు. గురువారం ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం ఉదయం ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాలతో భేటీ అయ్యారు. ఆయను మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డి కలిశారు.