ఇదేనిజం, శేరిలింగంపల్లి: ఆస్తికోసం బావమరిదిని సొంత బావ సుపారీ ఇచ్చి హత్యచేయించిన ఘటన గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా కావలికి చెందిన యశ్వంత్ (25) ఇటీవల నగరానికి వచ్చి గచ్చిబౌలి డీఎల్ఎఫ్ బాలాజీ పీజీ హాస్టల్లో ఉంటూ జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. అయితే ఈనెల1వ తేదీ అనుమానాస్పద స్థితిలో యశ్వంత్ హాస్టల్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గచ్చిబౌలి పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్నారు. కొడుకు మృతిపై తండ్రికి అనుమానం రావడంతో శుక్రవారం గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించి పిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరంచేసి తమదైన శైలిలో మృతుని బావను విచారించగా ఆస్తి కోసం తనే సుపారీ ఇచ్చి యశ్వంత్ ను హత్య చేయించి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లుగా ఒప్పుకున్నాడు. సుపారీ తీసుకున్న ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.