Babar Azam reappointed as Pakistan white-ball captain
టీ20 వరల్డ్ కప్‌కు ముందు పాకిస్థాన్ మెన్స్ క్రికెట్ జట్టులో కీలక మార్పులు జరిగాయి. పాకిస్థాన్ జట్టు కెప్టెన్‌గా బాబర్ అజమ్ తిరిగి పగ్గాలు అందుకోనున్నాడు. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. సెలక్షన్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసి బాబర్ అజమ్‌ను తిరిగి సారథిగా నియమించినట్లు తెలిపింది. దీంతో జూన్‌లో మొదలు కానున్న టీ20 వరల్డ్ కప్‌లో పాక్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. టీ20 ఫార్మాట్‌తో పాటు వన్డే ఫార్మాట్‌కు తనే నాయకత్వం వహించనున్నాడు.
రీసెంట్గా జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. దానికి బాధ్యత వహిస్తూ బాబర్ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీని వదులుకున్నాడు. మెగా టోర్నీ వైఫల్యంతో బాబర్ స్థానంలో టీ20లకు కెప్టెన్‌గా ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది, టెస్టులకు షాన్ మసూద్లను కెప్టెన్లుగా ఎంపిక చేశారు. వన్డే ఫార్మాట్‌కు కెప్టెన్ ఎవరనే విషయం మాత్రం తెలుపలేదు.
అయితే షాన్ మసూద్ నాయకత్వంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది పాక్. కానీ కంగారూల చేతిలో టెస్టు సిరీస్‌లో 3-0తో ఘోరంగా ఓడిపోయింది. ఇక షాహిన్ అఫ్రిది కెప్టెన్సీలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాక్ అక్కడ టీ20 సిరీస్‌లో 4-1తో దారుణంగా ఓడింది. ఇకపోతే షాహిన్ ఆఫ్రిది పాకిస్థాన్ సూపర్ లీగ్‌లోనూ పూర్తిగా విఫలమయ్యాడు.
పీసీబీ తీసుకున్న కెప్టెన్సీ మార్పు నిర్ణయాలపై విమర్శలు తీవ్రంగా వచ్చాయి. ఈ క్రమంలోనే పీసీబీ కొత్త చీఫ్‌గా కొత్తగా పగ్గాలు స్వీకరించిన మొహ్సిన్ నఖ్వీ(PCB Chief) కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో రెండు నెలల్లో ప్రారంభంకానున్న టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని బాబర్ అజామ్‌కు(Babar Azam New Captain) తిరిగి బాధ్యతలను అప్పగిచ్చారు. గతంలో చేసిన తప్పిదాలను సరిదిద్దుకోవాలని సూచిస్తూ జట్టు కూర్పు, కెప్టెన్సీపై కొత్త నిర్ణయాలను తెలిపారు. సెలక్షన్ కమిటీ సిఫారసు మేరకు బాబర్ ఆజామ్‌ను వన్డే, టీ20ల సారథిగా నియమిస్తున్నట్లు తెలిపారు.