Homeహైదరాబాద్latest Newsబడే భాయ్​ మోడీ.. చోటే భాయ్​ రేవంత్​ ఇద్దరూ కుమ్మక్కై కుట్ర: కేసీఆర్

బడే భాయ్​ మోడీ.. చోటే భాయ్​ రేవంత్​ ఇద్దరూ కుమ్మక్కై కుట్ర: కేసీఆర్

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: బడే భాయ్​ మోడీ, చోటే భాయ్​ రేవంత్​ ఇద్దరూ కుమ్మక్కై సింగరేణిని అదానీకి అప్పగించేందుకు సిద్ధమయ్యారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్​ ఆరోపించారు. సింగరేణి ప్రైవేటు పరం కాకుండా ఆపగలిగేది బీఆర్ఎస్​ మాత్రమేనన్నారు. ప్రమాదం పొంచి ఉందని, కార్మికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోక్​సభ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్​ ఎన్నికల ప్రచారంపై ఈసీ విధించిన 48 గంటల బ్యాన్ గడువు ముగియడంతో శుక్రవారం రాత్రి ఆయన మళ్లీ బస్సు యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా పెద్ద‌ప‌ల్లి ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని రామ‌గుండంలో నిర్వ‌హించిన రోడ్ షోలో ఆయన ప్ర‌సంగించారు. సింగరేణిపై చాలా పెద్ద కుట్ర జరగబోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘మంచిగా ఉన్న సింగరేణిని ఒకప్పుడు ముంచిందే కాంగ్రెస్‌ పార్టీ. ఇప్పుడు మరోసారి నరేంద్ర మోడీతో కలిసి రేవంత్ రెడ్డి సింగరేణిని ముంచేందుకు కుట్రలు పన్నుతున్నారు. వాస్తవానికి సింగరేణి మన తెలంగాణ ఆస్తి. వంద శాతం మనకే ఉండేది. ఉమ్మడి ఏపీలో కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పు తెచ్చి సింగరేణిని నష్టాల్లోకి పంపించి.. ఆ అప్పు తిరిగి చెల్లించలేక 49 శాతం వాటాను కేంద్రానికి అప్పజెప్పిందే కాంగ్రెస్‌ పార్టీ. ఇదీ ఆ పార్టీ చరిత్ర. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కార్మికులకు ఎన్నో లాభాలు తెచ్చాం. డిపెండెంట్‌ ఉద్యోగాలను పునరుద్ధరించి. 19 వేల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చాం. సింగరేణి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (సిమ్స్‌)పేరు మీద మెడికల్‌ కాలేజీ పెట్టుకున్నాం. ఆ మెడికల్‌ కాలేజీలో ఐదు శాతం కార్మికుల పిల్లలకే సీట్లు వచ్చేలా చేసుకున్నాం. కానీ ఇప్పుడు సింగరేణికి పెద్ద ప్రమాదం రాబోతుంది’అని కేసీఆర్ పేర్కొన్నారు.

అదానీని ఆహ్వానించింది నిజం కాదా?
బీఆర్ఎస్ హయాంలో తాను సీఎంగా ఉన్న రోజుల్లో కరెంటు ఉత్పత్తి కోసం ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలని మోడీ చెప్పారని.. తాను ఒప్పుకోలేదని కేసీఆర్ తెలిపారు. ‘ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తెచ్చేది అదానీ. ఆయన నరేంద్ర మోడీకి తమ్ముడులాంటి వ్యక్తి. మన దగ్గర 4 వేలకు టన్ను దొరికే బొగ్గును.. అక్కడ 28 వేలకు టన్ను కొనమన్నారు. నా ప్రాణం పోయినా సరే ఒప్పుకోనని చెప్పా. నాకు సింగరేణి బొగ్గు ఉండగా.. నీ బొగ్గు ఎందుకు అని చెప్పా. కానీ ఇవాళ ఈ సీఎం రేవంత రెడ్డి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఆదానీకి గేట్లు తెరిచి వచ్చాడు. అదానీ మీరు తెలంగాణకు రండి.. నాలుగు చేతులతో దోచుకోండి అని సంతకాలు కూడా పెట్టి పిలిచివచ్చాడు. పార్లమెంటు ఎన్నికలు అవ్వడమే ఆలస్యం.. ప్రధాని మోడీ, సీఎం రేవంత్‌ రెడ్డి కలిసి సింగరేణిని ఊడగొడతరు. ఇది నిజమా కాదా అని ఇంటికి వెళ్లాక చర్చ చేయండి. ముఖ్యమంత్రి అదానీని ఎందుకు పిలిచాడు. నేనెందుకు రానివ్వలేదు అనేది ఆలోచన చేయాలి’కేసీఆర్‌ సూచించారు.

సింగరేణి తెలంగాణ కొంగు బంగారం..
తెలంగాణకు సింగరేణి కొంగు బంగారం లాంటిదని కేసీఆర్ తెలిపారు. ఒక ఉద్యోగ వనరని పేర్కొన్నారు. ‘లక్షలాది మంది కార్మికులు, వారిని అనుసరించుకుని అనేక ప్రజలు బతికే ప్రాంతం సింగరేణి. దీన్ని ఇంకా విస్తరించాలి. బయ్యారం ఉక్కుగనులు గానీ, గోదావరి ఇసుక గనులు గానీ సింగరేణికే ఇవ్వాలని నేను సీఎంగా ఉన్నప్పుడు ఆలోచించా. సింగరేణి డైరెక్టర్‌ను ఆస్ట్రేలియాకు, ఇండోనేషియాకు పంపించా. సింగరేణి కంపెనీని ఆస్ట్రేలియా, ఇండోనేషియాలో పెట్టమని చెప్పా. కానీ ఇవాళ అదానీ కంపెనీ నుంచి బొగ్గును తీసుకుందామని ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు. ఇదీ తేడా. రాబోయే రోజుల్లో ఉన్న సింగరేణిని ఊడగొట్టి ఆదానీకి అప్పగిస్తే మన కార్మికుల నోట్లో మట్టే. మన ప్రజల నోట్లో మట్టి. మొత్తం సింగరేణి ప్రాంతాల్లోని ప్రజల బతుకులు బొగ్గు అయ్యే పరిస్థితి ఉంటుంది. సింగరేణి కార్మికులు ఈ మాటను చైతన్యంతో ఆలోచించాలి. మీ నిర్ణయం అలా తీసుకోవాలి. ఇది చాలా ప్రమాదం. ఇవాళ మీరు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ను గెలిపిస్తే నేను కూడా ఏం చేయలేను. కొప్పుల ఈశ్వర్‌ గెలిస్తే.. మొత్తం బీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటులో కొట్లాడుతాం. మా సింగరేణిని ఎట్ల ముంచుతరని పోరాడుతాం’అని కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలోని నదులను కేంద్రానికి అప్పజెబుతుంటే కూడా సీఎం రేవంత్ స్పందించరని కేసీఆర్ విమర్శించారు.

48 గంటల తర్వాత మాట్లాడుతున్నా..
తన ప్రచారంపై ఈసీ నిషేధం విధించిన 48 గంటల తర్వాత మళ్లీ తన గొంతు మాట్లాడుతోందని కేసీఆర్ తెలిపారు. ‘నేను ఏం చేశాన‌ని నా గొంతును ఆపారు. ఎందుకోసం నా గొంతును నొక్కేశారు. నేను మళ్లీ బ‌స్సు యాత్ర చేప‌ట్టిన త‌ర్వాత కాంగ్రెస్, బీజేపీకి గుండెలు వ‌ణుకుతున్నాయి. ఇద్ద‌రు కుమ్మ‌క్కై నిలువ‌రించాల‌ని కుట్ర చేశారు.. ప్ర‌చారంపై బ్యాన్ పెట్టారు. నేను ఇక్క‌డికి 2 గంట‌ల ముందే వచ్చా. బ్యాన్ ఉన్నందుకు 8.15 త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చా. రాజ‌కీయాల్లో మ‌తం గురించి మాట్లాడ‌టం ఎన్నిక‌ల నిబంధ‌న‌ల‌కు విరుద్ధం. కానీ అమిత్ షా త‌న చేతిలో దేవుడి బొమ్మ పెట్టుకుని మాట్లాడుతుంటే ఈసీకి క‌నిపించ‌దు. ప్ర‌ధాని మోడీ హిందూవులు, ముస్లింలు అని మాట్లాడితే ఈసీకి క‌నిపించ‌దు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏం చేశావ‌ని అడిగితే గుడ్లు పీకి గోలీలు ఆడుతాం, పండ‌వెట్టి తొక్కుతాం అని మాట్లాడితే ఈసీకి క‌న‌బ‌డ‌దు. చేనేత కార్మికుల ప‌క్షాన మాట్లాడితే ఈ ర‌కంగా బ్యాన్ చేశారు. ఎన్నిక‌ల్లో ఏ పార్టీ గెల‌వాల‌నేది ప్ర‌జ‌లే నిర్ణ‌యిస్తారు’అని కేసీఆర్ పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img