బోయపాటి-బాలకృష్ణ సినిమా వస్తుందంటే మాస్ ప్రేక్షకులకు పండగే. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’.. మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. 2021లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘అఖండ’ బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ల జాబితాలో చేరింది. దీంతో వీళ్లిద్దరి తర్వాత ప్రాజెక్ట్‌పై మూవీ లవర్స్‌లో ఆసక్తి నెలకొంది. తాజాగా దీనిపై బోయపాటి శ్రీను మాట్లాడారు. ‘ప్రస్తుతం ఎన్నికల హడావుడి ఉంది. ఇవి పూర్తయ్యాక ‘అఖండ2’ పై అధికారిక ప్రకటన ఉంటుంది. ‘అఖండ’లో పసిబిడ్డ.. ప్రకృతి.. పరమాత్మ.. కాన్సెప్ట్‌లనే చూపించాం. దీని సీక్వెల్‌లోనూ సమాజానికి కావాల్సిన ఓ మంచి విషయం ఉంటుంది. దైవత్వం మనందరిలో ఒక భాగం. దాన్ని తెరపై చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు’ అని తెలిపారు. ఇప్పటికే దీని స్క్రిప్ట్ వర్క్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. మాస్ యాక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత ఆయన క్లాస్ లుక్‌లో కనిపించనున్నారట. అలాగే దీనిలో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యం ఉంటుందని టాక్. ఇందులో మలయాళం అగ్ర హీరో కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.