– ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించా
– కరీంనగర్ ఎంపీ బండి సంజయ్
– కరీంనగర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు
ఇదేనిజం, కరీంనగర్: తాను పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీజేపీని పరుగులు పెట్టించానని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన కరీంనగర్లో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో బండి సంజయ్ మాట్లాడుతూ.. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేశానని చెప్పారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 150 రోజుల పాటు ప్రజాసంగ్రామ యాత్ర చేసి కాషాయ జెండాను తెలంగాణ అంతటా రెపరెపలాడించానన్నారు. ‘‘రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా పోరాడితే నాపై 30 దొంగ కేసులు పెట్టారు. నాపై మతతత్వవాది అనే ముద్ర వేసే ప్రయత్నం చేశారు. ధర్మం కోసం పోరాడేది భాజపా. రాజాసింగ్, నేను.. ధర్మం కోసం పోరాడేవాళ్లం. మేం ఎప్పుడూ కాషాయజెండాను వదిలిపెట్టలేదు. ఎన్నికల్లో భాజపా కార్యకర్తలు ఒక్కొక్కరు 10 ఓట్లు వేయించాలి’’ అని సంజయ్ పిలుపునిచ్చారు.