టాలీవుడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ అంటే తెలియని వారుండరు .ఎప్పుడు ఎదో ఒక వివాదం లో తెరపైకి వస్తుంటారు. రీసెంట్ గా ఒక చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కొని బండ్ల కు ఏడాది జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్ట్ ఈమేరకు తీర్పు ఇచ్చింది. బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానాను కూడా విధించింది కోర్టు. ఇక ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్ట్ ఇచ్చిన తీర్పును అప్పీల్ చేసుకునేందుకు నెలరోజుల గడువు కూడా ఇచ్చింది. తాజాగా బండ్ల గణేష్ కు సంబంధించి మరో వార్త వెలుగులోకి వచ్చింది. బండ్ల కొడుకు పోలీసులను ఆశ్రయించాడు. హీరా గోల్డ్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు నౌహీరా షేక్ తమపై దౌర్జన్యానికి పాల్పడిందంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. హీరా గోల్డ్ కేసులో నౌహీరా షేక్ ను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. భాగంగా ఆమెకు చెందిన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. అయితే ఈడీ స్వాధీనపర్చుకున్న ఇంటిని నౌహీరా షేక్ మోసపూరితంగా విక్రయించే ప్రయత్నం చేసిందని బండ్ల హీరేష్ ఫిర్యాదు చేశాడు.
అంతే కాదు ఆ ఇంటి కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే 3 కోట్లు తీసుకుని.. ఇప్పుడు ఖాళీ చేయాలంటూ రౌడీలతో బెదిరింపులకు పాల్పడుతున్నదంటూ బండ్ల హీరేష్ పోలీస్ లను ఆశ్రయించాడు. దీంతో ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.బండ్ల గణేష్ కొడుకు ఫిలింనగర్ రోడ్డునెంబర్–13 సైట్–2లోని ప్లాట్‌నెంబర్ 15–ఏలో నౌహీరా షేక్‌కు చెందిన ఇంట్లో 2023 నుంచి అద్దెకు ఉంటున్నాడు. కాగా కొంతకాలం తర్వాత ఆ ఇంటిని విక్రయిస్తానని నౌహీరా చెప్పింది. అయితే ఆ ఇంటిని మేమే కొంటామని చెప్పి రూ. 3 కోట్లు చెల్లించినట్లు తెలిపాడు. ఈ క్రమంలో మొత్తం డబ్బు ముట్టజెప్పే సమయంలో ఆ ఇల్లు ఈడీ కేసులో ఉన్నట్లు తెలిసిందని.. దీనిపై నౌహీరాను వివరణ అడగగా తాను మాత్రం దాటవేస్తూ తప్పించుకుందని ఆరోపించాడు. అంతే కాదు మిగతా డబ్బులు చెల్లించాలని తమపై ఒత్తిడి చేస్తుందని, ఇల్లు ఖాళీ చేయాలంటూ బెదిరింపులకు పాల్పడుతుందంటూ బండ్ల హీరేష్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నౌహీరా పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.