బంగ్లాదేశ్ మహిళా జట్టును చిత్తుగా ఓడించి ఆస్ట్రేలియా మహిళా జట్టు మరో సిరీస్ ను కైవసం చేసుకున్నారు. ఇటీవలే న్యూజిలాండ్‌ను వారి సొంతగడ్డపై చిత్తు చేసిన ఆసీస్.. తాజాగా బంగ్లాదేశ్‌ను సైతం వారి స్వదేశంలో మట్టికరిపించింది. ఐసీసీ వన్డే ఛాంపియన్‌షిప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (మార్చి 27) జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఆస్ట్రేలియా ఘన విజయాలు సాధించింది. తొలి వన్డేలో 118 పరుగుల తేడాతో, రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో ఆసీస్ గెలుపొందింది.
మ్యాచ్ విషయానికొస్తే..ఢాకాలో జరిగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆసీస్ బౌలర్ల ధాటికి 26.2 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. కిమ్ గార్త్, ఆష్లే గార్డ్‌నర్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. ఎల్లిస్ పెర్రీ, మోలినెక్స్ తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో నిగర్ సుల్తానా (16), షోర్ణా అక్తర్ (10), సుల్తానా ఖాతూన్ (10), మరుఫా అక్తర్ (15 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 90 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 18.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. అలైసా హీలీ 33, లఫోబ్ లిచఫీల్డ్ 12 పరుగులు చేసి ఔట్ కాగా.. ఎల్లిస్ పెర్రీ 27, బెత్ మూనీ 21 పరుగులతో అజేయంగా నిలిచి ఆసీస్‌ను గెలిపించారు. బంగ్లా బౌలర్లలో సుల్తానా ఖాతూన్, రబెయా ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.