తెలంగాణలోని ఆరు జిల్లాల మహిళా సంఘాలు, గిరిజనులకు బతుకమ్మ చీరల పంపిణీకి బ్రేక్ పడింది. ఈ నెల 6న ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కొమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాల మహిళలకు బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర చేనేత సహకార సంఘం నుంచి చీరలను సరఫరా చేసింది. అయితే పండుగ వేళ అందరికీ ఇవ్వకుండా కొందరికే ఇస్తున్నారని పంపిణీ కేంద్రాల వద్ద బాహాటంగానే వ్యతిరేకత వచ్చినట్టు సమాచారం. కేవలం ఆరు జిల్లాల్లోనే చీరల పంపిణీ చేపట్టగా మిగతా 27 జిల్లాల ఆడబిడ్డలకు ఇవ్వకుంటే వారి నుంచి ఆగ్రహం తప్పదని భావించిన ప్రభుత్వం అప్పటికప్పు డు పంపిణీని నిలిపివేయాలని రాష్ట్ర చేనేత సహకార సంఘం ఎండీ శైలజ రామయ్యర్ ఉత్తర్వులు జారీచేసి కలెక్టర్లకు పంపించారు. బతుకమ్మ పండుగ తర్వాత ఈ నెల 15 నుంచి చీరల పంపిణీని చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.