హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇండ్లను కట్టిస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వం ఆ మేరకు ఇండ్లను చూపెట్టలేకపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క అన్నారు. గత కొన్ని రోజులుగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ తనను తీసుకెళ్లి మొత్తం 3428 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని చూపెట్టినట్టు తెలిపారు. అసెంబ్లీలో లక్షల ఇండ్లను చూపెడతానని మంత్రి చెప్పిన మాటలు అబద్దాలని తేలిపోయిందన్నారు. గ్రేటర్ ప్రజల కోసం మొత్తం 96 వేల ఇండ్లను కడుతున్నట్లు చెబుతున్న ప్రభుత్వం కట్టింది మాత్రం 3428 ఇండ్లు మాత్రమేనన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కడుతున్న డబుల్ బెడ్రూం ఇండ్లను ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో స్థానికులకు ఇస్తామని ఓట్లు వేయించుకున్నారని, ఇవే ఇండ్లను త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ చూపెట్టి ఓట్లు దండుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు భట్టి విమర్శించారు.
మహేశ్వరం నియోజకవర్గంలో ఇండ్లు చూపెట్టి ఇవే గ్రేటర్ ప్రజలకు అంటున్నారని.. మరి స్థానికులకు ఎక్కడ ఇస్తారని ఆయన ప్రశ్నించారు. తుక్కుగుడా మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇవే ఇండ్లు చూపెట్టి ఓట్లెసుకున్నారని.. ఇప్పుడు అవే ఇండ్లను గ్రేటర్ వాసులకు ఇస్తాం అంటున్నారని.. మరి వారికి ఎక్కడ ఇస్తారని ఎద్దేవా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మేడ్చల్ జిల్లాలో మున్సిపాలిటీ ఇండ్లను సైతం జీహెచ్ఎంసీ ఇండ్లు అని చెబుతున్నారంటూ భట్టి పేర్కొన్నారు.