Homeహైదరాబాద్latest Newsయథేచ్ఛగా బెల్టుషాపులు

యథేచ్ఛగా బెల్టుషాపులు

ఇదేనిజం, మెట్ పల్లి : ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పటికీ కోరుట్ల నియోజకవర్గంలో బెల్టు షాపులు కొనసాగుతూనే ఉన్నాయి. కోరుట్ల నియోజకవర్గంలోని మెట్ పల్లి, కోరుట్ల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నా ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మద్యం అక్రమ విక్రయాలకు సహకరిస్తున్న అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదంటున్నారు. ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులతో సత్సంబంధాలు కలిగిన నిర్వాహకులు మద్యం విక్రయాలను యథావిధిగా కొనసాగిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. గతంలో నిర్వహించిన కేంద్రాలను మూసివేసి, మరో ప్రాంతంలో కొత్తగా కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు అధికారుల సూచనలు మేరకు నిర్వాహకులు భారీ స్థాయిలో మద్యం సీసాలను రహస్య ప్రాంతాల్లో నిల్వ చేసినట్లు తెలుస్తోంది. డిమాండ్ మేరకు కొన్ని కొన్ని మద్యం సీసాలను బయటకు తెచ్చి మద్యపాన ప్రియులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.


పెరిగిన ధరలు
అధికారులకు ఇచ్చే మామూళ్లు పెరిగాయన్న సాకుతో బెల్ట్ షాపు నిర్వాహకులు మద్యం ధరలను భారీగా పెంచారని మద్యపాన ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మద్యం అమ్మకాలపై ఎస్బీ కి ఫిర్యాదులు

మద్యం అమ్మకాలు యదేచ్చగా కొనసాగుతున్నా స్థానిక పోలీసులు పట్టించుకోవడం లేదని ప్రజలు స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కుస్తాపూర్, వేంపల్లి, వెంకట్రావుపేట్, వాల్గొండ గ్రామాల్లో స్పెషల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు. పది రోజుల వ్యవధిలో నాలుగు గ్రామాల్లో పోలీసులు చేసిన దాడిలో దాదాపు వంద లీటర్ల మద్యం సీసాలు పట్టు బడ్డాయి. మద్యాన్ని సీజ్ చేసి, బెల్ట్ షాపు నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా బెల్ట్ షాపులకు అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న వైన్ షాపు యజమానులపై ఇటు పోలీసులు గానీ.. ఎక్సైజ్ అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు అసహనంతో ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ అధికారులు తక్షణమే స్పందించి బెల్టు షాపుల నిర్వహణపై సమగ్రమైన విచారణ జరిపాలని స్థానికులు కోరుతున్నారు. బెల్టు షాపులకు అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న వైన్స్ యజమానులు, వారికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img