Homeహైదరాబాద్latest Newsతెలుగు రాష్ట్రాలకు బిగ్​ అలర్ట్​.. చిన్న పిల్లల్లో కొత్త రకం జ్వరం.. ఈ లక్షణాలు కనిపిస్తే...

తెలుగు రాష్ట్రాలకు బిగ్​ అలర్ట్​.. చిన్న పిల్లల్లో కొత్త రకం జ్వరం.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులలో స్కార్లెట్ జ్వరం వ్యాప్తి ఆందోళనకు గురిచేస్తోంది. రోజురోజుకు దీని బారినపడుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతుండడంతో ఆసుపత్రులన్నీ పిల్లలతో నిండిపోతున్నాయి. సరిగ్గా పిల్లలకు పరీక్షలు ప్రారంభమైన సమయంలో ఈ వ్యాధి వ్యాప్తి ఇబ్బంది పెడుతోంది. ప్రతి 20 మంది చిన్నారుల్లో 12 మందిలో స్కార్లెట్ జ్వరం లక్షణాలు కనిపిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. కొందరి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆసుపత్రిలో అడ్మిట్ చేసిన చికిత్స అందిస్తున్నారు. గతంలోనూ ఈ వ్యాధి కనిపించినప్పటికీ ఇప్పుడు దీని తీవ్రత మరింతగా పెరిగింది. స్కార్లెట్ జ్వరం స్ట్రెప్టోకోకల్ ఫారింగైటిస్ బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. ఈ వ్యాధి సోకిన చిన్నారులు దగ్గినా, తుమ్మినా ఆ తుంపర్ల ద్వారా ఇతరులకూ సోకుతుంది. ఇది సాధారణ జ్వరమనో, లేదంటే వైరల్ లక్షణాలే కదా అని నిర్లక్ష్యం చేస్తే అది మరింత తీవ్రమై, ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు. పిల్లల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని, తగ్గే వరకు స్కూల్ కి పంపవద్దని , జాగ్రత్తగా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు. 102 డిగ్రీలతో కూడిన జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి, వికారం, వాంతులు, కడుపునొప్పి, శరీరంపై దద్దుర్లు కనిపిస్తాయి. నాలుక రంగు స్ట్రాబెర్రీ కలర్‌లోకి మారడం, గొంతు, నాలుకపై తెల్లని పూత, ట్రాన్సిల్ ఎరుపు రంగులో పెద్దగా ఉంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలి. నిర్లక్ష్యం చేస్తే న్యూమోనియా, రుమాటిక్‌ ఫీవర్‌, తీవ్రమైన కీళ్ల నొప్పులు, గుండె సమస్యకు దారి తీస్తుంది. ఈ సీజన్‌లో 5 నుంచి 15 ఏళ్ల వయస్సు పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కన్పిస్తే వైద్యులను వెంటనే సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. అలా అని విపరీతంగా భయపడాల్సిన పని లేదని, వెంటనే యాంటిబయోటిక్స్‌ ఔషధాలు ఇవ్వడంతో పూర్తిగా తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img