Homeహైదరాబాద్latest NewsBIG ALERT.. క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

BIG ALERT.. క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. గత మూడు, నాలుగు రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రివేళ ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నెల ఆఖరి వరకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ అధికారిణి శ్రావణి వెల్లడించారు. రాత్రి ఉష్ణోగ్రతలు 25 నుంచి 26 డిగ్రీల వరకు నమోదవుతాయని తెలిపారు. ఏప్రిల్‌ రెండోవారం నుంచి ఎండల తీవ్రత మరింత పెరుగనున్నట్టు పేర్కొన్నారు. ఏప్రిల్‌, మే నెలల్లో ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో వడగాల్పులు అధికంగా ఉంటాయన్నారు.

గతవారం వర్షపాత సూచనలు ఉన్నప్పటికీ.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 39.3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని శ్రావణి తెలిపారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ పరిసర ప్రాంతాల్లో 39 డిగ్రీలు, మధ్య తెలంగాణ జిల్లాల్లో 36 నుంచి 35 డిగ్రీలు, దక్షిణ తెలంగాణ జిల్లాలైన నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాల పరిసర ప్రాంతాల్లో 37 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే 24 గంటల్లో 39 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్టు పేర్కొన్నారు.

ఈ నెల చివరి నాటికి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదయ్యే అవకాశముంటుందని శ్రావణి వెల్లడించారు. ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్‌ రెండో వారంలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. ఉష్ణోగ్రతల వల్ల ద్రోణి ఏర్పడుతుందని, ఫలితంగా సాయంత్రం వేళలో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని తెలిపారు. ఏప్రిల్‌ మూడు, 4వ వారం, మే నెలల్లో పిడుగుల ప్రభావం ఉంటుందని తెలిపారు. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు వడగాల్పులు వీస్తాయని, ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల మధ్య ఉంటాయని తెలిపారు. ఏప్రిల్‌, మే నెలల్లో హైదరాబాద్‌లో ఒకటి, రెండుసార్లు వడగాలులు వీస్తాయని తెలిపారు. హైదరాబాద్‌లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ, కాంక్రీట్‌ నిర్మాణాల వల్ల వేడి ఎక్కువగా ఉంటుందని ఆమె వివరించారు.

Recent

- Advertisment -spot_img