Rajiv Yuva Vikasam: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు బ్యాడ్ న్యూస్.. రాష్ట్ర ప్రభుత్వం ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రస్తుతానికి నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు రూ.50,000 నుంచి రూ.4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించాలని గతంలో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం, ఖర్చుల మధ్య అంతరం నెలకు రూ.9,000 కోట్లకు చేరుకోవడంతో ఆర్థిక ఒత్తిళ్లు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త సంక్షేమ పథకాల అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘రాజీవ్ యువ వికాసం’ పథకం కూడా ఈ నిర్ణయం పరిధిలోకి వచ్చింది. ఈ పథకం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవసరాలను సృష్టించడంతో పాటు, ఆర్థికంగా ఆదుకోవడానికి రూపొందించబడింది. ఈ పథకం నిలిపివేతతో నిరుద్యోగ యువతలో నిరాశ నెలకొంది. రాష్ట్రంలో యువత ఉపాధి కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఈ నిర్ణయం వారి ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. ప్రభుత్వం ఆర్థిక స్థిరత్వం సాధించిన తర్వాత ఈ పథకాన్ని తిరిగి పునరుద్ధరిస్తుందా లేక వేరే ప్రత్యామ్నాయ పథకాలను ప్రవేశపెడుతుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.