Homeహైదరాబాద్latest Newsరేవంత్ కు గట్టి దెబ్బ.. సొంత జిల్లాలోనే ముఖ్యమంత్రికి బిగ్ షాక్

రేవంత్ కు గట్టి దెబ్బ.. సొంత జిల్లాలోనే ముఖ్యమంత్రికి బిగ్ షాక్

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సొంత జిల్లాలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సర్వ శక్తులు ఒడ్డినా.. ప్రలోభాలకు తెరలేపినా విజయం దక్కలేదు. వెరసి కాంగ్రెస్ పార్టీ పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో విజయం సాధించలేకపోయింది. వాస్తవానికి అధికార పార్టీ కాంగ్రెస్ కు ఎన్నో సానుకూల అంశాలు ఉంటాయి. అయినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలు కావడం గమనార్హం. ఈ ఎన్నికను సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన హడావుడిగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి మరీ ఓటేశారు. ఈ ఎన్నికలో తాము విజయం సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆత్మవిశ్వాసం ప్రకటించింది. కానీ చివరకు ఓటమి పాలైంది. మరి ఈ ఫలితంతో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ఆధిపత్యానికి కొంత మేర గండి పడే అవకాశం ఉంది. త్వరలో రాబోతున్న పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లోనూ పాలమూరులో ప్రతికూల ఫలితాలు వస్తే .. ముఖ్యమంత్రి ప్రతిష్ఠ మరింత మసకబారే చాన్స్ ఉంది. ఏది ఏమైనా ఈ ఫలితాలు కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం నింపాయి. ఇక బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి. రాష్ట్రంలో గులాబీ పార్టీ పని అయిపోయిందని ప్రచారం జరుగుతున్న వేళ.. ఈ ఫలితాలు సగటు గులాబీ సైనికుడికి ఉత్సాహం నింపాయి. ఓ వైపు ఎగ్జిట్ పోల్ ఫలితాలు బీఆర్ఎస్ కేడర్ లో నిరాశ నింపగా.. ఆ మర్నాడే వెలువడిన ఫలితాలు జోష్ నింపాయి.

బీఆర్ఎస్ విజయ దుందుబి
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌ విజయదుందుబి మోగించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్‌కుమార్‌ రెడ్డి 111 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలుపొందారు. ఈ ఎన్నికలో మొత్తం 1,437 ఓట్లు పోలవగా అందులో 21 ఓట్లు చెల్లనివిగా నిర్ధారించారు. మిగిలిన 1,416 ఓట్లలో బీఆర్ఎస్‌కు 763, కాంగ్రెస్ అభ్యర్థికి 652 ఓట్లు వచ్చాయి. ఉమ్మడి జిల్లా స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీగా ఉన్న కశిరెడ్డి నారాయణరెడ్డి గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మారడం.. కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో మార్చి 28న ఎన్నికలు నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ తరఫున నవీన్‌కుమార్‌ రెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్‌ పార్టీ నుంచి మన్నె జీవన్‌ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్‌ బరిలో నిలిచారు. ఈ పోటీకి బీజేపీ దూరంగా ఉన్నది. మొత్తం 1437 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, ఇద్దరు ఎంపీటీసీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి శాసనసభ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

Recent

- Advertisment -spot_img